బాలీవుడ్ లో వినాయక చవితికి ఒక స్పెషల్ ఉంటుంది. అన్ని పండగల కన్నా వినాయక చవితిని బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. వినాయకుడి పూజ దగ్గరనుండి నిమజ్జనం చేసేవరకు అంతా హడావిడి... సెలెబ్రేషన్స్ జరుగుతూనే ఉంటాయి. ఒక్కో సెలబ్రిటీ ఇంట్లో గణపతి పూజ కోసం చాలా మంది సెలెబ్రిటీలు హాజరవుతూ వుంటారు. ఇక టాలీవుడ్ లో ఇలాంటి పూజలు జరిగినా పెద్దగా హైలెట్ అవ్వవు. ఇక్కడ హైద్రాబాద్లోనూ గణేష్ పూజలు, నిమజ్జనాలు చాలా బాగా జరుగుతాయని అందరికి తెలుసు. కానీ సెలబ్రిటీస్ మాత్రం పూజలు చేసినా నిమజ్జన కార్యక్రమాన్ని తూ తూ మంత్రం గా కానిచేస్తారు. అయితే ఈ ఏడాదికి టాలీవుడ్ లోనూ ఒక ప్రత్యేకత ఉందట. అదే దుబాయ్ ట్రిప్ ముగించుకుని ఇంటికొచ్చిన మహేష్ ఫ్యామిలీ మాత్రం గణపతి పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించింది. ఇక మహేష్ కుమారుడు గౌతమ్ మాత్రం ఈ సంవత్సరం తన ఇంట్లో ఒక బుజ్జి గణపయ్యని ప్రతిష్టించి... తన తండ్రి మహేష్ తో కలిసి పూజలు చేసి... ప్రత్యేకంగా గణపతి నిమజ్జనం నిర్వహించాడు. పూజ అనంతరం మహేష్ తన సినిమా షూటింగ్ కోసం చెన్నై వెళ్ళగా.... ఈ గణపతి నిమజ్జనాన్ని గౌతమ్ తన చేతుల మీదుగా హైదరాబాద్ లోని దుర్గమ్మ చెరువులో చేసాడు. ఈ నిమజ్జనం ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. మహేష్ కొడుకు గౌతమ్ భక్తి గురించి ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు.