ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయంలో కేంద్రప్రభుత్వం చేతులెత్తేసింది. గత కొంత కాలంగా ఊరిస్తూ ఊరిస్తూ ఒక్కసారిగా ఇక ఏపీకి ప్యాకేజీయేనంటూ వెల్లడించింది. దీంతో ఏపీకి ప్రత్యేక హోదా హుళక్కి అయినట్టే. ఈ విషయంలో ఏపీ సీయం కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తూనే ఏపీ ప్రజల వేడికి తగ్గట్టుగా ఇక ప్రత్యేక హోదాపై ఉద్యమిస్తాం అన్నట్లు వెల్లడించాడు. చంద్రబాబు మాట్లాడుతూ... ఇచ్చిన హామీలు, ప్యాకేజీ త్వరగా కేంద్రం రాష్ట్రానికి అందించాలని తెలిపాడు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా ప్రతిపక్ష నేత జగన్ శనివారం నాడు రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చాడు. కాగా కార్యకర్తలంతా బంద్ ను విజయవంతం చేయాలని జగన్ కోరాడు. ఈ సందర్భంగా జగన్ ప్రత్యేక హోదా వచ్చినట్లయితే వేలకొద్ది పరిశ్రమలు, లక్షలాది మందికి ఉపాధి లభిస్తుందని తెలిపాడు.
అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం జగన్ కు ఓ రకంగా మేలు చేకూర్చేలా ఉంది. ప్రత్యేక హోదా కోసం రెండున్నరేళ్ళుగా దీక్షలు, రకరకాల నిరసనలు తెలుపుతున్న జగన్.. ఇక నుండి ప్రత్యక్షంగా కేంద్రంతో అలయన్స్ పెట్టుకున్న చంద్రబాబు ఏపీకి ప్రత్యేక హోదా తేలేని అసమర్ధుడు అని మరో రెండున్నరేళ్ళు ఏకధాటిగా ఒకే బాణంతో జనాలను ఆకర్షించవచ్చు. చంద్రబాబు ప్రభుత్వానికి, పార్టీకి ఈ ప్రకటన ఓ రకంగా ప్రజల్లోని ఇమేజ్ ని డ్యామేజ్ చేసేదే అని చెప్పవచ్చు. ఇక జగన్ హోదా వస్తే... అంటూ మొదలెట్టి యువత ఆశలు తీరేవి అన్నట్లు బాణాలను పేల్చేస్తాడు. ఆ రకంగా మైలేజ్ సాధించుకోడానికి జగన్ కి ఇదో అందివచ్చిన అవకాశంగా చెప్పవచ్చు.