అవును కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదాకి మంగళం పాడినట్లే. ప్రత్యేక హోదాకి ధీటుగా ప్రత్యేక ప్యాకేజి ఇవ్వడానికి కేంద్రం రెడీ అయ్యింది. ప్రత్యేక ప్యాకేజి కాదండోయ్ ప్రత్యేక డెవలప్మెంట్ ప్యాకేజి అంట. ఇలా వెరైటీగా చెబితే బాగుంటుందని అలా పేరు పెట్టినట్లున్నారు. ఈ రోజు ఉదయం వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీ, రాజనాథ్ సింగ్ ఇంకా ఏపీ కేంద్రమంత్రి సుజనా చౌదరి, ఎంపీ సీఎం రమేష్ భేటీ అయ్యారు. ఈ భేటీ లో ప్రత్యేక డెవలప్మెంట్ ప్యాకేజి ప్రకటించబోతున్నామని స్పష్టం చేస్తున్నారు వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీ. ప్రత్యేక హోదాకి బదులుగా ప్రత్యేక ప్యాకేజి ఇవ్వడానికి కేంద్రం రెడీ అయ్యింది.అయితే అసలు ప్రత్యేక హోదా ఇవ్వకుండా ప్రత్యేక ప్యాకేజి ఎవరికీ కావాలయ్యా బాబు అంటున్నారు జనాలు. ఇక విజయవాడ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ని కేంద్రం ఏర్పాటు చేస్తుందని అంటున్నారు. అంతే కాకుండా రాజధాని బాధ్యత కేంద్రం తీసుకుంటుందని రాజనాథ్ చెబుతున్నారు. అయితే రాజధాని డెవలప్మెంట్ నిధుల గురుంచి ఈ రోజు ప్రకటన చెయ్యరంట. అలా ప్రకటించేస్తే మళ్ళీ గొంతు మీద కూర్చుని.. ఏపీ నిధులు వసూలు చేస్తుందని అనుకున్నారు కాబోలు. అందుకే నిధుల ప్రకటన ఈ రోజు ఉండదని చెబుతున్నారు. అమరావతి డిపిఆర్ ని బట్టి నిధులను సమకూరుస్తుందంట. ఇక అమరావతి లో నిర్మించబోయే ప్రభుత్వ కార్యాలయాలను ప్రభుత్వమే నిర్మించి ఇస్తుందని రాజనాథ్ చెబుతున్నారు. బ్యాంకు రుణాల ద్వారా ఆర్ధిక సహాయం చేస్తుందట. పోలవరానికి 70% మాత్రమే నిధులు ఇస్తామని చెబుతున్నారు. కేంద్రం ఎంత తెలివిగా ఏపీకి అన్యాయం చేస్తుందో చూశారా!. అసలు ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఇవన్నీ మాట్లాడుతున్న కేంద్రాన్ని ప్రజలు ఎప్పటికి క్షమించరు. ఇక ఏపీ లో బిజెపికి కూడా కాంగ్రెస్ కి పట్టిన గతే పడుతుంది మరి. ఇక ఈ ప్యాకేజి విషయాన్ని కేంద్ర మంత్రులు ఈ రోజు మధ్యాన్నం ప్రెస్ మీట్ పెట్టి మరీ తెలియపరుస్తారట.