ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రత్యేక హోదా విషయంలో కేంద్రప్రభుత్వం తర్జనభర్జనతో కూడిన తీవ్ర కసరత్తు చేస్తుంది. ప్రత్యేక హోదా ఇవ్వాలా...? లేక దాంతో సమానమైన ప్యాకేజీతో సరిపెట్టేద్దామా..? అన్నదానిపై కేంద్రం తలమునకలై ఆలోచిస్తుంది. ఈ విషయానికి సంబంధించి కేంద్రప్రభుత్వం సెప్టెంబర్ 2వ తేదీన ప్రకటన చేస్తున్నట్లు అందుతున్న సమాచారం. ప్రత్యేక హోదా విషయాన్ని చాలా కాలం నుండి నాన్చుతూ వస్తూ ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగడంతో ఇంకా నాన్చినట్లయితే సమస్య మరింత జటిలమయ్యే ప్రమాదముందన్నది కేంద్రం అభిప్రాయం. పవన్ కళ్యాణ్ ఆవేశపూరిత రంగ ప్రవేశంపై కేంద్రం ఆంధ్రరాష్ట్రంపై దృష్టి సారించింది. వీలైనంత త్వరగా ఈ సమస్య నుండి బయటపడాలన్నట్లు తీవ్ర కుస్తీ పడుతుంది. అలా కాని పక్షంలో ఆంధ్రా నుండి మరో బలమైన రాజకీయ ప్రత్యర్ధిని పెంచి పోషించినట్లవుతుందని కేంద్రం భయపడుతుంది.
కానీ ఈ సారి మాత్రం కేంద్రం ఏదో కుంటి సాకులతో తాత్సారం చేయడానికి ప్రయత్నిస్తే ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా పోరాటం ముందే విషయాన్ని తేల్చేయాలని చూస్తుంది కేంద్రం. అలా కాకుండా పవన్ ప్రత్యేక హోదాకోసం ఉద్యమంలోకి దుమికితే ప్రజలందరూ ఆయనతో చేతులు కలిపే అవకాశం ఉంటుంది. ఒకవేళ సెప్టెంబర్-2వ తేదీన కేంద్రం ఆంధ్రాకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించినట్లయితే పవన్ కళ్యాణ్ ఎలాంటి స్టెప్ తీసుకుంటాడో వేచి చూడాలి. కేంద్ర ప్రభుత్వ ప్రకటించబోయే ప్యాకేజీ, రాయితీలతో ప్రజలు సంతృప్తి చెందినట్లయితే పవన్ వేసే ఎత్తుగడను భాజపా తుంచి వేసినట్లు అవుతుంది. అలా కాని పక్షంలో భాజపా, తెదేపా ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉంది. పవన్ కళ్యాణ్ సెప్టెంబర్ 9న కాకినాడలో బహిరంగ సభ నిర్వహిస్తే ప్రజల స్పందనను చూసైనా కేంద్రానికి చమటలు పడతాయా..? గతంలో విభజన కావాలంటూ, వద్దంటూ రాష్ట్రం అగ్నిగుండంలా మార్చింది కేంద్రం.. ఇలాంటి ఘటనలే మళ్ళీ కేంద్రం ఎదుర్కోనుందా..? ఇంకా ఆంధ్ర తడాఖా చూస్తామన్నట్లు భాజపా తన మైండ్ గేమ్ లో భాగంగా తమ పార్టీపై అనుకూల పవనాలు వీసేంతవరకు చూసి అప్పుడు ప్రకటించి తమ పార్టీ ఉనికిని కాపాడుకోవాలని ప్రయత్నిస్తుందా..? ఇన్ని విషయాలు కూడా ప్రజల మెదళ్ళలో చక్కర్లు కొడుతున్నాయి. వీటన్నింటికీ పరిష్కారం సెప్టెంబర్-2న దొరుకుతుందేమో చూద్దాం.