'జనతా గ్యారేజ్' ప్రేక్షకుల ముందుకురావడానికి మరో రోజు (గురువారం) గడువు ఉంది. ఎన్నో అంచనాల నడుమ వస్తున్న ఈ చిత్రంపై సినీ వర్గాల్లో లక్షల్లో బెట్టింగ్స్ కడుతున్నారని సమాచారం. 'శ్రీమంతుడు'ను క్రాస్ చేస్తుందని ఒక వర్గం అంచనా వేస్తోంది.
ఇకపోతే ఈ సినిమాలో ఎన్టీఆర్ ఉపయోగించిన బైక్ ప్రత్యేకంగా ఉంది. ఇప్పటికే దీనిని ఛారిటీ కోసం అమ్మకంలో పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక ఈ బైక్ నంబర్ జాగ్రత్తగా గమనిస్తే 'ఎం.హెచ్. 43 ఎ.ఎస్. 2096' అని ఉంది. అంటే మహారాష్ట్రకి చెందిన రిజిస్ట్రేషన్ నంబరన్నమాట. సినిమా విడుదలయ్యేది రెండు తెలుగు రాష్ట్రాల్లో, వీటికి సంబంధం లేని రిజిస్ట్రేషన్ నంబర్ బైక్‌ను కావాలని ఉపయోగించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఏదో ఒక తెలుగు స్టేట్‌కు సంబంధించింది అయితే లేనిపోని గొడవ వచ్చే అవకాశం ఉంది. సినిమాలో ప్రతి చిన్నదానికి ప్రజాసంఘాలు లేదా ఇతర సంఘాలు విమర్శలు చేస్తున్నాయి. గతంలో ఎన్టీఆర్ నటించిన 'సాంబ' చిత్రానికి సైతం ఇవి తప్పలేదు. అలాగే మరో బైక్ 'ఎటిఎన్ 4029' అని ఉంది. ఇది దాదాపు పాతికేళ్ళ క్రితం రిజిస్ట్రేషన్ నంబర్. పాతది కావడం వల్ల ఇబ్బంది ఉండదని అనుకుని ఉండవచ్చు. దర్శకుడు ఈ విషయంలో జాగ్రత్తపడ్డాడా ? లేక కాకతాళీయంగా జరిగిందా? అనేది తెలియదు కానీ, మంచి నిర్ణయమే.