జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తిరుపతి బహిరంగ సభలో చేసిన ప్రసంగంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. పవన్ ప్రసంగంపై నేతలంతా మమ్మల్నే తిడుతున్నాడు అన్నట్లు ఎవరికి వారు భుజాలు తడుముకున్నారు. ముఖ్యంగా అధికార పక్షమైన తెదేపాలో పవన్ కళ్యాణ్ కోల్డ్ వార్ రాజేసినట్లుగానే జరుగుతున్న పరిణామాలను బట్టి తెలుస్తుంది. ఇంకా ప్రతిపక్ష పార్టీ నాయకులు అయితే పవన్ అప్పుడప్పుడు ఇలాంటి సభలు పెట్టి తమ చమత్కారాన్ని చాటుకుంటాడులే అన్నట్లు లైట్ తీసుకుంటున్నారు. కొంత మందైతే పవన్ రాజకీయంగా బుడతడు అంటే, మరికొందరు మంచి నటుడు అంటూ వారి వారి అభిప్రాయాలు వెలిబుచ్చారు. కానీ పవన్ కళ్యాన్ ప్రసంగంపై సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తులు చాలా తక్కువ మందే స్పందించారు. అప్పుడు శివాజీ, ఇప్పుడు సంపూర్ణేష్ బాబు. బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు పవన్ తిరుపతి ప్రసంగంపై విచిత్రంగా స్పందించాడు.
సంపూర్ణేష్ బాబు హీరోగా రాణించడానికి సోషల్ మీడియా చాలా కీలంకంగా ఉపయోగపడిన విషయం తెలిసిందే. ఇదే సోషల్ మీడియా ద్వారా సంపూ తన అభిప్రాయాన్నిప్రకటించాడు. ‘నేను తెలంగాణాలో పుట్టాను. అయినా నా సోదర ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇంత కష్టాల్లో ఉన్నారని, వారి గుండెల్లో ఎంతో ఆవేదన దాగి ఉందని పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం ద్వారానే బాగా అంతుపట్టింది. తెలుగు ప్రజలకు రాష్ట్రాలు వేరైనా కష్టాలు వచ్చినప్పుడు తెలుగు వారంతా ఒక్కటే. సీమాంధ్రులకు జరుగుతున్న అన్యాయాన్ని కేంద్ర ప్రభుత్వం దగ్గరికి తీసుకువెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. ముఖ్యంగా సినీ పరిశ్రమకు చెందిన వాళ్లపై ఈ బాధ్యత మరింత ఉంది. ఎందుకంటే వాళ్ల టిక్కెట్ డబ్బులతోనే మనం బ్రతుకుతున్నాం. అందుకే పవన్ కళ్యాణ్ ఉద్యమానికి నేనూ ఒక గొంతుకను అవుతాను’ అంటూ సంపూర్ణేష్ బాబు చెప్పాడు.