ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ మధ్య మీడియా ముందు తెగ అల్లరి చేసి మరీ సంచలనాలు రేపుతున్నాడు. రాజకీయంగా ఆయన మాటలు పెద్ద దుమారం రేపుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ సభ్యులు ఒక్కొక్కరిపై ఆయన దుమ్మెత్తి పోస్తున్నాడు. వారి వారి ఆస్తుల చిట్టా విప్పి ఇవి ఎట్టా సంపాయించారో లెక్క చెప్పమంటున్నాడు. ఇదంతా అధికార పార్టీ వారిపైనా విరుచుకు పడుతుండటంతో నిజంగా ఈయన మాటల వెనుక ఏదో ఆశ ఉన్నట్టుగానే కనపడుతుంది. కాగా ఈయన మాటలన్నీ ఏపీ ప్రతిపక్ష నాయకుడైన వైసీపీ అధినేత జగన్ కి చాలా మేలు కలిగించేవిగా కూడా ఉండటంతో ఇది జగన్ విడిచిన బాణమా..? అన్న అనుమానాలు కూడా మొదలయ్యాయి. మొదలకావడం కాదు ఇది అక్షరాలా నిజం అని కూడా అప్పుడే మీడియా కోడై కూస్తుంది. నిజానికి ఉండవల్లి కరడుగట్టిన అనలేం గాని, కాంగ్రెస్ వాది అంతే. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఆయన మాటల తూటాలు పేలుస్తూ ఓ వెలుగు వెలిగిపోయాడు. మంచి మాటకారి. అందుచేతనే అందరి దృష్టిలో పడి మాటలతో ఆకట్టుకొని అలా పదవులను అనుభవించాడు. అస్సలు విషయం ఏమిటంటే... వైఎస్ హయాంలో ఉండవల్లికి ఎదురే ఉండేది కాదు. ఆయన ఏమంటే అది జరగాల్సిందే. వైఎస్ విడిచిన బాణాన్నంటూ రామోజీరావుపై పలు కేసులు కూడా పెట్టాడు.
ప్రస్తుత విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ లో ఆయన.. పైకి కాంగ్రెస్ పార్టీనే అంటిపెట్టికొని ఉన్నా.. మనస్సు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే చక్కర్లు కొడుతున్నట్టుంది. ఎందుకంటే చాలా కాలం నుంచి గమ్ముగా ఉన్న ఉండవల్లి ఈ మధ్యనే మరీ అతిగా ఆంధ్రప్రదేశ్ రాజధానిపై, నాయకుల అవినీతిపై వల్లమాలిన అభిమానాన్ని చూపుతున్నాడు. ఇదంతా తన రాజకీయ భవిష్యత్తు కోసమేనని కొందరి ఆలోచన. ఏపీలో 2019లో కూడా కాంగ్రెస్ పరిస్థితి నిరాశాజనకంగానే ఉంటుందని తెలిసి ఏదో ఒక రకంగా ముందుకు వెళ్ళాలని, ఆ రకంగా తమ మైలేజ్ ని, ఇమేజ్ ని పోగు చేసుకోవాలని చూస్తున్నాడు ఉండవల్లి అరుణ్ కుమార్. ఆయన మీడియాతో దబ దబా మాట్లాడేస్తాడు, అలాంటి సమయంలో ఆయన చెప్పకూడదనుకున్న రహస్య విషయాలు కూడా కక్కేస్తాడు. అక్కడే దొరికిపోతాడు. అందరికీ అప్పుడు తెలుస్తుంది ఆయన అసలు రంగేంటి అనేది. మొన్న మీడియాతో మాట్లాడే సందర్భంలో.. రాజశేఖర్ రెడ్డి కొడుకు జగన్ పై తమకు అభిమానం ఉంది. ఎందుకు ఉండకూడదు, అతడు మా కళ్ల ఎదుటే జోగాడిని పిల్లాడు, అలాంటి కుర్రాడు.. జగన్... సీఎం అవుతాడంటే తమకు అంతకంటే ఆనందం మరొకటి ఏముంటుంది.... అన్నాడు. అదీ విషయం. ఇక్కడ దొరికిపోయాడు ఉండవల్లి. అంటే తమ అధిష్ఠానం తిట్టమన్నప్పుడు ఆ కుర్రాడు దొంగ. ఇప్పుడు జగన్ చాలా మంచి జెమ్. అస్సలు మీరు భలే మాటకారి ఉండవల్లి. లాజికల్ గా మాట్లాడుతానంటూ తూటాలు బాగా పేలుస్తుంటారు.
సరే ఇప్పుడు జగన్ పార్టీలోకి ఉండవల్లి వెళ్ళడం ఖాయమన్న వార్తలు బయటికి పొక్కుతున్నాయి. ఇదే నిజమైతే 2019లో రాజమండ్రి టికెట్ ఉండవల్లికి ఖాయం చేసెయొచ్చు జగన్. కాగా అమరావతిని భ్రమరావతి చేసినా, మంత్రి నారాయణ ఆస్తుల చిట్టా బయట పెట్టినా, ఆ పెట్టిన వ్యక్తి ఎదుటి వారి నుంచి ఎలాంటి ప్రయోజనాన్ని ఆశించకుండా ఉండాలి. ఇంకా నిజాయితీగా వ్యవహరిస్తూ ఒట్టి డప్పా మాటలకే పరిమితం కాకుండా చేతలతో ఏదైనా కాస్త ప్రజలకు పనికొచ్చే పని చేసి చూపిస్తే ఆ నాయకుడికి ఆ పార్టీలో గానీ, ఏ పార్టీలోనైనా మనుగడ అనేది ఖచ్చితంగా ఉంటుంది.