మామూలుగా ఓ పెళ్లి వేడుక జరుగుతోందంటే అందరి కళ్లూ వధూవరులపైనే ఉంటాయి. అయితే నిన్న జరిగిన ఓ పెళ్ళిలో మండపం పైనున్న వధూవరులు ఎంత ఆకర్షణగా నిలిచారో, వాళ్లకి ధీటుగా కిందనున్న ఓ జంట కూడా అంతే ఆకర్షించింది. ఆ జంట ఎవరో కాదు.. సమంత, నాగచైతన్య. ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ కూతురు పెళ్లి హైదరాబాద్‌లో జరిగింది. ఆ వేడుకకి పెద్దయెత్తున సెలబ్రిటీలు హాజరయ్యారు. అందులో నాగార్జున ఫ్యామిలీ కూడా ఉంది. నాగచైతన్య, సమంత కలిసి ఆ వేడుకకి హాజరయ్యారు. దీంతో అందరి దృష్టీ వాళ్లపైనే పడింది. త్వరలోనే పెళ్ళి చేసుకొంటారని వార్తలొస్తున్న సమయంలోనే చైతూ, సమంత కలిసి వేడుకకి హాజరవడం చర్చనీయాంశమైంది. కాబోయే భార్యాభర్తలంటూ ఆ ఇద్దరినీ ప్రత్యేకంగా చూశారు అతిథులు. పనిలో పనిగా అన్నట్టు నాగార్జున కూడా నాగచైతన్య, సమంతల జంటని వేడుకకి హాజరైన క్రికెటర్ సచిన్ టెండూల్కర్ దంపతులకి పరిచయం చేశాడు. నాగ్, సచిన్ ఇద్దరూ మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే. నాగచైతన్య, సమంతల జోడీని చూసి సచిన్ కూడా మెచ్చుకొన్నారట. అందమైన జంట అనీ కితాబునిచ్చినట్టు తెలిసింది. సచిన్ భార్య అంజలి కూడా ఆ జంటని చూసి ముచ్చటపడినట్టు తెలిసింది. ఇద్దరూ చాలా బాగున్నారని మెచ్చుకోవడంతోపాటు సమంతతో అంజలి చాలా సేపు మాట్లాడిందని తెలిసింది.