రియో ఒలింపిక్స్ లో రజత పతకం సాధించి సింధు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అలాగే భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా సింధు ‘ఖేల్ రత్న’ అవార్డును కూడా అందుకుంది. కాగా జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా వివిధ క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభను కనబర్చిన పలుగురికి ఢిల్లీలో ఈ అవార్డుల ప్రదానం జరిగింది. అయితే ఈ ఖేల్ రత్న అవార్డును సింధుతో పాటు ఒలింపిక్స్ లో తన సత్తా చాటిన రెజ్లర్ సాక్షి మాలిక్ కూడా ఖేల్‌రత్న అవార్డును అందుకున్నారు. కానీ ఒలింపిక్స్ లో ఎటువంటి పతకం సాధించనప్పటికీ అద్భుతమైన ఆట తీరును కనబరచి, మంచి పోటీని ఇచ్చిన జిమ్నాస్ట్ దీపా కర్మాకర్, షూటర్ జీతూరాయ్ లు కూడా ‘ఖేల్‌రత్న’ అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు.
విషయం ఏంటంటే ఒక సంవత్సర కాలంలో ఏకంగా నలుగురు ‘ఖేల్‌రత్న’ అవార్డులు అందుకోవడం ఇదే మొదటిసారి. కాగా ‘ఖేల్‌రత్న’ అవార్డును పొందిన ఒక్కొక్కరికీ పతకంతో పాటు, ప్రశంసా పత్రం, రూ. ఏడున్నర లక్షల చొప్పున నగదు బహుమతిని అందిస్తున్న విషయం తెలిసిందే.