తమ అభిమాన హీరోల మీద ఉండే వీరాభిమానం వల్ల పక్క హీరోలపై ఫ్యాన్స్ దురభిమానం పెంచుకుంటున్నారు. ఈ గొడవలు చివరికి ప్రాణాలు తీసే స్దాయికి చేరుతున్నాయి. తమ హీరో సినిమా హిట్టయితే ఆనందపడటంలో తప్పులేదు. కానీ పక్క హీరోల చిత్రాలు ఫ్లాప్ అయినప్పుడు కూడా వారి వ్యతిరేక హీరోల అభిమానులు పండగ చేసుకోవడం మరీ దారుణం. దానికి ఇటీవలి కాలంలో వచ్చిన పవన్‌కళ్యాణ్ 'సర్దార్‌గబ్బర్‌సింగ్', మహేష్‌బాబుల 'బ్రహ్మోత్సవం' చిత్రాల విషయంలో ఫ్యాన్స్ అనుసరిస్తున్న చర్యలు అందరికీ వేదన కలిగించాయి. కాగా వాస్తవాలను ఉన్నది ఉన్నట్లుగా నిర్భయంగా మాట్లాడే దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజా అభిమానుల తీరునే కాకుండా ఆయా హీరోలను కూడా తప్పుపట్టారు. ఘటన జరిగిన తర్వాత మొక్కుబడిగా దానిపై స్పందించడం, నీతుల చెప్పడం మాని తామంతా ఒక్కటే అని నిరూపించేలా, అభిమానులకు అర్థమయ్యేలా కలసి కట్టుగా మన హీరోలంతా ఒక తాటిపైకి వస్తేనే నిజమైన నిజాయితీ అవుతుందన్నారు. ఇక తమను తాము హైలైట్ చేసుకుంటూ ఇతర హీరోలను అవమానించేలా పంచ్ డైలాగుల పేరుతో మన స్టార్ హీరోలు తమ అభిమానులను తప్పుదోవ పట్టిస్తున్నారని, ఇలాంటి పంచ్‌డైలాగుల విషయంలో కూడా హీరోలు ముందుగా ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించాడు. మరి భరద్వాజ వంటి నిజాయితీ కలిగిన వ్యక్తి మాట్లాడే మాటలు వినే ఓపిక, సహనం మనకు ఉన్నాయా? లేదా? అనేది ఆయా హీరోలు, వారి అభిమానుల విజ్ఞత మీదే ఆధారపడివుంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.