వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత వాసిరెడ్డి పద్మ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై విరుచుకు పడింది. ఏపీ చాలా సంక్షోభంలో ఉందంటూనే చంద్రబాబు, కేంద్రంతో మెత్తని వైఖరి అవలంభించడం ఏంటని వెల్లడించింది. ఏపీలో ప్రస్తుత పరిస్థితులు, కేంద్రంపై బాబు అవలంబిస్తున్న విధానంపై వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తింది. గోదావరి ప్రాజెక్ట్ ల విషయంలో చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని కూడా ఆమె ప్రశ్నాస్త్రాలు సంధించింది. తెలంగాణా ప్రాజెక్టులు పూర్తయితే గోదావరి జలాలు ఆంధ్రప్రదేశ్కి చుక్క కూడా రావని ఆమె అభిప్రాయాన్ని వెలిబుచ్చింది.
ఇంకా ఆమె మాట్లాడుతూ... రాష్ట్రానికి నీళ్లు తీసుకురాలేని చంద్రబాబు టెక్నాలజీ పేరుతో ఏపీ ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించడం ఎంతవరకు సమంజసంగా ఉందని ఆమె ఎద్దేవా చేసింది. చూడబోతే చంద్రబాబు వ్యవహార శైలి స్వామిజీలకు మించిపోయేలా ఉందని వివరించింది. చిదానందం స్వామిలాగానే చంద్రబాబు కూడా టెక్నాలజీ యాప్ ల గురించి మాట్లాడడం చాలా విడ్డురంగా ఉందని తెలిపింది. ఇంకా ప్రత్యేక హోదా విషయంలో బాబు కేంద్రంతో లాలూచీ పడ్డారని అందుకనే ఆ విషయంపై ముందుకు అడుగు వేయలేక పోతున్నారని ఆమె మండిపడింది. కాగా చంద్రబాబునాయుడు ఇకనైనా కళ్ళు తెరిచి చూడకపోతే చరిత్ర హీనులుగా మిగిలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది.