ప్రస్తుతం సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో మహేష్‌బాబు హీరోగా తెలుగు,తమిళ భాషల్లో ఓ బారీ బడ్జెట్ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కాగా ఇటీవల ఓ తమిళ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన మురుగదాస్ ఆ ఇంటర్వ్యూలో మహేష్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. మహేష్‌గారు చాలా అంకిత భావంతో పనిచేస్తారు. ప్రిన్స్ అనే బిరుదుకు తగ్గట్లుగా ఎంతో హుందాగా ఉంటారు. ప్రతి షాట్ పూర్తయిన తర్వాత ఆయన నా మొహం వైపు చూస్తారు. నామొహంలో ఆయనకు ఏమాత్రం అసంతృప్తి కనిపించినా, తానే మరో టేక్ చేద్దాం సార్ అంటారు. చెప్పే ప్రతి విషయాన్ని ఆయన ఎంతో జాగ్రత్తగా వింటూ ఉంటారు. అలాంటి హీరోతో కలిసి పనిచేయడం నాకు ఎంతో సంతోషంగా ఉంది.. అంటూ చెప్పుకొచ్చారు మురుగదాస్. అసలు ఏ హీరోతో నటిస్తే ఆ హీరోలను పొగడ్తలతో భజన చేసే సంస్కృతిని మురుగదాస్ కూడా బాగానే వంటపట్టించుకున్నాడు.... అనే సెటైర్లు వినిపిస్తున్నాయి. ఆయన 'స్టాలిన్' చేసినప్పుడు కూడా చిరును ఆకాశానికి ఎత్తేసిన సంగతి గుర్తుండే ఉంటుంది.