భారత్ అంటే పాకిస్తాన్ కు గానీ, పాకిస్తాన్ అంటే భారత్ కు గానీ అస్సలు పడటం లేదన్న విషయం అందరికీ తెలిసిందే. ఇలాంటి సందర్భంలో కన్నడ నటి రమ్య.. పాకిస్తాన్ కూడా చాలా మంచి ప్రాంతమని, అక్కడి ప్రజలూ ఆదరాభిమానాలు చూపుతారని, వారికీ మనసున్నదని వెల్లడించి వార్తల్లోకెక్కింది. పాకిస్తాన్ వెళ్ళడం అంటే నరకానికి వెళ్ళడమేనన్న భారత రక్షణ మంత్రి మనోహర్ పారికర్ వ్యాఖ్యలను ఖండిస్తూ రమ్య అలా స్పందించింది. అలా వివాదాస్పదమైన వ్యాఖ్యలతో దేశద్రోహం కేసులో ఇరుక్కున్న నటి రమ్యపై ఆందోళన కారులు కోడిగుడ్లతో దాడిచేశారు. కర్ణాటకలోని మంగుళూరులో ఆమె కారుపై ఆందోళన కారులు కోడి గుడ్లు విసిరారు. విమానాశ్రయం నుంచి రమ్య నగరంలోని ఓ కార్యక్రమానికి హాజరుకావడానికి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. పటిష్టమైన పోలీస్ భద్రత ఉన్నప్పటికీ ఆందోళనకారులు నల్లజెండాలు చూపి ఆమె కారుపై గుడ్లు విసిరి మరీ నిరసన వ్యక్తం చేశారు. దీనిపై రమ్య స్పందిస్తూ... ఈ విషయంలో ఏమాత్రం తన మాటను వెనక్కి తీసుకొనే ప్రసక్తే లేదనీ, ఆందోళనుకారులు సంఘ్ పరివార్ కు చెందిన వ్యక్తులుగా తనకు పోలీసులు సమాచారం కూడా ఇచ్చారని వెల్లడించింది.
ఇటీవల పాకిస్థాన్ కు వెళ్లిన రమ్య పాక్ కు మద్దతుగా వ్యాఖ్యలు చేయడం దాంతో దుమారం రేగిన విషయం తెలిసిందే. ఈ విషయంలో తన తప్పేమి లేదని, తాను క్షమాపణలు ఎందుకు చెప్పాలని తెల్పడంతో వివాదం మరింత ముదిరింది. కాగా రమ్య మాట్లాడుతూ... తమపై రాజ ద్రోహం ఆరోపణలు రాజకీయ కుట్రలో భాగమని, అలా కానట్లయితే ఫిర్యాదు చేసిన కాపీలు తమకంటే ముందుగా మీడియా వర్గాలకు చేరడం చాలా శోచనీయం అన్నది. ఇంకా భాజపా తమ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే ఎంతటి వారినైనా ఇలా భరతం పడుతుందని వెల్లడించింది.