తెలుగు రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా, అత్యంత వైభవంగా కృష్ణ పుష్కరాలను శుక్రవారం ప్రారంభించాయి. అయితే విజయవాడలోని దుర్గా ఘాట్ వద్ద ఈరోజు శుక్రవారం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా కృష్ణర స్నానం ఆచరించి కృష్ణ పుష్కరాలను అధికారికంగా ప్రారంభించారు. అదే సందర్భంలో హిందూపురం ఎమ్మెల్యే బాలయ్యబాబు కూడా సతీసమేతంగా పుష్కర స్నానం ఆచరించి కృష్ణానదికి పసుపు కుంకుమలు సమర్పించారు.
గురువారం రాత్రే గోదావరి నుండి పుష్కరుడు కృష్ణానదిలో కలిసే సందర్భంగా జరిగిన పవిత్ర సంగమ కార్యక్రమంలోనూ చంద్రబాబు సతీమణితో పాటు బాలయ్యబాబు కూడా సతీ సమేతంగా పాల్గొన్నారు. కాగా శుక్రవారం దుర్గాఘాట్ వద్ద నున్న పుష్కర స్నానానికి బాలయ్య బాబు అచ్చం 'గౌతమీపుత్ర శాత్రకర్ణి' గెటప్ లో వచ్చి భక్తులను ప్రత్యేకంగా ఆకట్టుకున్నాడు.
బాలయ్య బాబు పుష్కర స్నానం అయ్యాక కొండపై కొలువై ఉన్న కనకదుర్గ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ఈ పుష్కర సమయంలో అన్ని ప్రాంతాలలోని ప్రజలు కృష్ణ స్నానం ఆచరించడం ద్వారా అందరి పాపాలు పోతాయని, పుణ్యం వస్తుందని వెల్లడించారు. మొత్తానికి బాలకృష్ణ, బాబును డామినేట్ చేసి మరీ తనదైన శైలిలో ప్రత్యేకతను చాటుకున్నారు.