సమరమే....అన్నట్లుగా మారింది బాలీవుడ్ లో ఇద్దరు ప్రముఖ హీరోల మధ్య పోటీ. నీవా నేనా అన్నంత రేంజిలో ఆ ఇద్దరూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఒకపక్క 'మొహంజొదారో' చిత్రంతో హృతిక్ రోషన్, మరోపక్క 'రుస్తుమ్' చిత్రంతో అక్షయ్ కుమార్ ల మధ్య పోటీ మరింత తీవ్రమైంది. అశుతోష్ గోవారికర్ దర్శకత్వం వహించిన 'మొహంజొదారో', టిను సురేష్ దేశాయ్ దర్శకత్వం వహించిన 'రుస్తుమ్' ఈ నెల(ఆగష్టు) 12వ తేదీన విడుదల కానున్నాయి. ఈ రెండు సినిమాలు టాప్ హీరోలతో ప్రముఖ దర్శకులతో చేసినవే కాబట్టి రెండు చిత్రాల మధ్య పోరు ఆసక్తికరంగా మారింది.
రెండు వేల సంవత్సరాల క్రితం నాటి మొహంజొదారో సామ్రాజ్యాన్ని తిరిగి సృష్టించి అద్భుత రీతిలో వంద కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కించిన చిత్రం 'మొహంజొదారో'. అయితే మూడేళ్ళ నుండి ఎంతో శ్రమించి అలనాటి గొప్ప సెట్టింగ్స్ ను రూపొందించి ఓ విజువల్ వండర్ గా మలిచారు దర్శకులు అశుతోష్ గోవారికర్. కానీ మొహంజదారో సినిమా ట్రైలర్స్ చూశాక సినిమా ప్రియులకు ఇందులో ఏ మాత్రం ఆనాటి వాతావరణం, డిజైనింగ్ వంటివి కనిపించలేదు. అంతా అత్యాధునికమైన నేపథ్యంతో కూడిన దృశ్యాలు ఉండటంతో చూపరులకు కాస్త మంట రేగుతుంది. దీనికి తోడు ఆకాశాదిత్య లామా అనే రచయిత ఇది నా కథ, నా నాటకంలోని కథాంశం అని పోరు బాట పట్టడం వంటి కాంట్రవర్సీ ఈవెంట్స్.. సినిమా ప్రచారానికి బాగా ఉపయోగపడతాయి గానీ, సినిమాని బట్టే ప్రేక్షకాదరణ ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుందో?
ఇక అక్షయ కుమార్ నటించిన 'రుస్తుమ్' సినిమా అద్భుతమైన కంటెంట్ ఉన్న చిత్రంగా టాక్ వచ్చింది. 1959లో బాంబే నేపథ్యంగా సాగ్ ఓ నేవీ అధికారి కథతో 'రుస్తుమ్' తెరకెక్కింది. ఇందులో అక్షయ్ కుమార్ నేవీ అధికారి. మంచి సర్వీసు అందించి గొప్ప ప్రతిభా పురస్కారాలు అందుకున్న వ్యక్తి. అయితే అనుకోకుండా ఓ పార్టీలో అమ్మాయిని చూసి ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు. ఆమె మాత్రం అతన్ని కళ్ళుగప్పి మరొకరితో శృంగారంలో పాల్గొన్న సమయంలో అతనికి దొరికిపోతుంది. అతడు వెంటనే భార్య పక్కనున్న వ్యక్తిని కాల్చి చంపుతాడు. తర్వాత అతడిని పోలీసులు కోర్టులో ప్రవేశ పెడితే అక్కడ తెలుస్తుంది అందరికీ..... అతడు కాల్చింది... భార్యతో శృంగారంలో పాల్గొన్నందుకు కాదట. మరేదో కారణం ఉందట వంటి వైవిధ్య భరితమైన గొప్ప కథాంశం ఉన్న చిత్రంగా 'రుస్తుమ్' ఆగష్టు 12న విడుదలకు ముస్తాబైంది. అయితే ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన ట్రైలర్స్ అన్నింటిపై పాజిటివ్ టాక్ వచ్చింది. మొహంజొదారొ కూడా చరిత్ర, సంస్కృతి, అలనాటి జీవనం నేపథ్యంగా తెరకెక్కిన అద్భుత చిత్రరాజమే. దీంతో అంతర్గతంగా అటు హృతిక్ కు ఇటు అక్షయ్ కు.. ఇద్దరి మధ్య బయటకు చెప్పలేనంత టెంక్షన్ మొదలైంది.