ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనగానే వెంటనే మదిలో ఉద్యమిస్తున్న నాయకుడు అని జ్ఞాపకం వస్తుంది. ఎందుకంటే ఎప్పుడూ ఆయనగారు ఓదార్పు యాత్ర అనీ, చలో ఢిల్లీ అనీ, ఆమరణ నిరాహార దీక్ష అనీ, నిరసన దీక్ష అనీ, గ్రామ పోరు, జిల్లా పోరు, ఇంటింటికి వైఎస్ఆర్ అంటూ ఏదో ఒకటి ఇష్యూని రైజ్ చేసుకొంటూ చల్లారిపోతుంటారు. ఇప్పుడు తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ సరికొత్త రీతిలో దర్శనమిస్తున్నారు. అంటే పోరు బాట జరిపి జరిపి విసికెత్తినట్టుంది జగన్ కి అలా ఊరట కోసమని చింతన మార్గాన్ని అవలంబిస్తున్నాడు.
పాపం రెండున్నరేళ్ళగా తన ఉనికి, పార్టీ ఉనికిని ప్రజల్లో కాపాడుకునేందుకు ఆయన పడ్డ పాట్లు అంతా ఇంతా కాదు. ప్రజలు అతడిని గుర్తించుకొనేందుకు తాను చేపట్టని కార్యక్రమాలు గానీ, ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు అనుసరించని మార్గాలు గానీ లేవనే చెప్పాలి. ఎందుకంటే వైఎస్ఆర్ సీపీని ప్రజలు మర్చిపోకుండా గుర్తించుకునేందుకు తెగ తంటాలు పడ్డారు. కానీ అందులో ఏ మాత్రం విజయం సాధించారనేదే ప్రధాన విషయం.
జగన్ ఏపీ ప్రజల మనస్సును ఎంతమాత్రం చూరగొన్నారు అన్న విషయాన్ని ఒక్కసారి తరచి చూసుకున్నట్లయితే అందులో 'ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది' అని చెప్పక తప్పదు. ఎంచేతంటే భారత రాజ్యాంగంలో ఓటమి పాలైన వ్యక్తికి ప్రజలు ఐదు సంవత్సరాలు అద్భుత కాలాన్ని కల్పించారు. తన్ను తాను తెలుసుకోమని. ప్రతి అడుగు ఆత్మ విమర్శతో వెయ్యమని చెప్తారు. అదేవిధంగా భవిష్యత్ప్రణాళిక పకడ్బందీగా నిర్మించుకో అనీ చెప్పకనే చెప్తారు. రాజనీతి శాస్త్రంలో 'యథా రాజ తథా ప్రజా' అని గొప్ప వాక్యం ఉంది. ఆ విషయాన్ని గమనించి నాయకుడు తన్ను, తన లక్షణాలను ఆ దిశగా నిరంతరం మలుచుకుంటూనే ఉండాలి. తన స్వప్న సాకారం కోసం నిరంతరం సుందరమైన ఆలోచనలు చేస్తూనే ఉండాలి. అందుకు తగట్టుగా నియోజకవర్గ స్థాయి నుండి తమ వ్యవస్థను పటిష్ట పరుచుకుంటూ ఉండాలి. అది నిరంతర చైతన్యంతో చేయవలసిన పని. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో సున్నమన్న చందంగా సభ్యుల ఎంపిక విషయంలో నిరంతరం పప్పులో కాలేస్తూ ఉండకుండా చూసుకోవాలి. అసలు ఈ రెండున్నరేళ్ళలో పార్టీ పరమైన బ్యాక్ గ్రౌండ్ వర్కు ఎంతవరకు చేశారు, అందులో ఎంతమాత్రం మైలేజ్ ను సాధించారన్న విషయాన్నిపరికిస్తే అది ఇల్లే అనే చెప్పాలి. నాయకుడు ఎప్పుడూ వ్యక్తిగతమైన లాభాలను, తాత్కాలికమైన అవసరాలను గురించి స్వార్ధంతో ఆలోచించుకోకుండా నిజాయితీ గల వాడు, ప్రజల మెప్పు పొందుతున్న వారిని గమనించి ఎంచుకోవడంపైనే నిరంతరం దృష్టిపెట్టి పరిశ్రమించాలి. అది ఇప్పుడు అధికార పక్షంలో 10 యేళ్ళు ఉన్న వ్యక్తి పకడ్బందీగా ఆచరణాత్మకంగా తన సమ్రాజ్యాన్ని నిర్మించుకొన్నాడు కాబట్టే అటువంటి మైలేజ్ ను పొందగలిగాడు. ఇప్పటికీ ప్రజల మన్ననలకు పాత్రుడవుతున్నాడు.
అల్లా ఆలోచించకుండా అస్థిరజ్ఞుడులా జగన్ స్థమిత మతిని ఆశించి భక్తిబాట పట్టారంటే ఆశ్చర్యమేస్తుంది. ఒక బలవంతమైన అధికారంలో గల నాయకుడిని ఢీకొనాలంటే ఎలాంటి నిర్మాణాత్మకమైన వైఖరిని అవలంబించాలనే దానికి సంబంధించిన పటిష్టమైన వ్యవస్థ పుష్కలంగా ఉంది. ఆంధ్రాలోని అణువణువును, ప్రతి మనిషి నాడిని తెలుసుకోగల సామర్ధ్యమూ ఉంది. అయితే ప్రస్తుతం కావలసిందల్లా నమ్మకంతో కూడిన అంకితభావంతో ముందుకు పోయి, ఆ దిశగా ప్రజల విశ్వాసాన్ని చూరగొనడమే. అంతేగానీ ఎన్నడూ లేని విధంగా నిర్మలత్వం కోసం స్వామీజీల వెంట పడటమో అందుకోసమని ఆధ్యాత్మిక యాత్రలు జరపడమో కాదు. అంచేత జగన్ నిరంతరం ఆలోచనతో అడుగు వేయడం ఎంతైనా అవసరం.