బస్ కండెక్టర్ గా అతి సామాన్య జీవితం గడుపుతున్న శివాజీరాజ్ కు సినిమాలో అవకాశం ఇచ్చి రజీనీకాంత్ ను చేసింది కె. బాలచందర్ అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే రజనీకాంత్ ను సూపర్ స్టార్ చేసింది మాత్రం అరుణాచలమే. ఈయన మంగళవారం చెన్నైలో మృతి చెందాడు. 75 ఏళ్ళ పంచు అరుణాచలం, రజనీకాంత్ ను మాస్ కు దగ్గర చేసి సూపర్ స్టార్ ని చేశారు. రచయిత, నిర్మాత అయిన అరుణాచలం, రజనీకాంత్ తో కలిసి దాదాపు 23 సినిమాలు చేశారు.
తమిళలో ప్రముఖ రచయిత కణ్ణాదాసన్ కు ప్రత్యక్ష శిష్యుడు అరుణాచలం. రజనీకాంత్ తో కలిసి అరుణాచలం 'కఝుగు, పొక్కిరీ రాజా (చుట్టాలున్నారు జాగ్రత్త), పాయుమ్ పులి (దెబ్బకు దెబ్బ), వీర (ముత్తు) వంటి అద్భుతమైన చిత్రాలను చేశారు. ఇవన్నీ విజయవంతమైన చిత్రాలే. కమల్ హాసన్ తో కూడా అరుణాచలమే గొప్ప చిత్రాలు నిర్మించి కమల్ ను మాస్ కు దగ్గరకు చేర్చారు. మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజాలో ప్రతిభను గమనించి చేరదీసి సంగీత ప్రపంచానికే రారాజును చేసింది కూడా ఆయనే. ఈయన నిర్మించిన 'అన్నకిలి' చిత్రం ద్వారా ఇళయరాజా సినిమా పరిశ్రమకు పరిచయం అయ్యారు. ఇంతటి మహోన్నతమైన వ్యక్తి మృతి చెందడంతో ఒక్కసారిగా తమిళ పరిశ్రమ దిగ్భ్రాంతికి లోనైంది.