ప్రస్తుతం తమిళస్టార్ డైరెక్టర్ మురుగదాస్‌తో తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న చిత్రంలో మహేష్ నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఆ తర్వాత ఆయన పూరీతో చిత్రం చేస్తాడని కొందరు, కాదు వంశీపైడిపల్లి చిత్రంలో ఓ చిత్రం చేస్తాడని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు మురుగదాస్ తర్వాత మహేష్.. వంశీ పైడిపల్లితోనే పివిపి సంస్ద నిర్మాణంలో ఓ చిత్రం చేయనున్నాడని కన్‌ఫర్మ్ అయింది. మహేష్ పివిపి సంస్దలో చేసిన భారీ చిత్రం 'బ్రహ్మోత్సవం' చిత్రం డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. దాంతో ఆయన పివిపికి మరో చిత్రం చేస్తాడని వార్తలు వచ్చినప్పటికీ మహేష్‌కు ఉన్న బిజీలో ఆయన వెంటనే ఈ చిత్రంలో నటించే అవకాశం లేదని, పివిపి సంస్ద మరికొంత కాలం వెయిట్ చేయకతప్పదని కొందరు భావించారు. కానీ మహేష్ మాత్రం పెద్ద మనసు చేసుకొని ఎక్కువకాలం పివిపి సంస్దను ఇబ్బందిపెట్టకుండా మురుగదాస్ తదుపరి చిత్రం వారికే చేస్తున్నాడు. కాగా ఈ చిత్రానికి మహేష్ పారితోషికం తీసుకోవడం లేదని, లాభాలు వస్తే అందులో మాత్రమే వాటా తీసుకుంటున్నాడని సమాచారం. అలాగే ఈ చిత్రాన్ని 'బ్రహ్మోత్సవం' చిత్రంను భారీ రేట్లకు కొని నష్టపోయిన బయ్యర్లకే ఇవ్వాలని ఆయన పివిపి సంస్ధకు షరత్తు కూడా పెట్టాడని తెలుస్తోంది. మొత్తానికి ఈ చిత్రం విషయంలో మహేష్ తాను నిర్మాతల హీరోనని మరోసారి నిరూపించుకున్నాడు.