ఒకప్పుడు సినిమాకి హీరోని ఎంపిక చేయాలంటే డైలాగ్ లు గొప్పగా చెప్పాలనీ, ఫైట్స్ గట్టిగా చేయాలని, మెరిసిపోయేలా డ్యాన్స్ లు వేయాలని కొన్ని కొలమాణాలు పెట్టుకునే వారు దర్శక నిర్మాతలు. తర్వాత అందంతో పాటు, హైట్, వెయిట్ అంతా పరిమాణాలుగా మారిపోయాయి. ఆ తర్వాత ఎంత అందమున్నా, అద్భుత నటనను ప్రదర్శిస్తున్నా కథా కథనాల్లో విషయం లేకపోతే ప్రత్యక్ష ప్రమాణాలుగా భావిస్తున్న ప్రేక్షక దేవుళ్ళు ఆయా చిత్రాలను ఆదరించడమో, అనాదరించడమో చేయడం పరిపాటిగా మారింది. ఇక్కడ నుండే హీరోలు కూడా తమ పాత్రల పోషణ, సముచితమైన కథ కథనాలున్నసినిమాలను ఎన్నుకోవడం మొదలెట్టారు. అసలు హీరోగా రాణించిన ప్రతివాళ్ళకి ఏదో ఒక గమ్మత్తయిన మహత్తు ఉండే ఉంటుంది.
ఇప్పుడు విషయంలోకి వస్తే మహేష్ బాబు స్వచ్ఛమైన తెలుగుతనం ఉట్టిపడే హాలీవుడ్ హీరోలా దర్శనమిస్తాడు. అన్నప్పుడల్లా కాకుండా అవసరమైనప్పుడే చిరుస్మితం, సుందర దరహాసం మహేష్ ముఖం నుండి చిందుతుంది. అదీ చాలా మితంగానే ఉంటుంది. అదీ విషయం. ఆ నవ్వులో ఏముందో, మహేష్ నవ్వు మహత్తు ఏంటో తెలియదు గానీ, అలా ఓ చిరునవ్వుతో ప్రేక్షకుల మతులు పోగొడుతున్నాడు. ఒక్క నవ్వుతో అభిమానులను తెలియని మహత్తులోకి తీసుకెళ్తున్నాడు. ఆనంద పరవశులను చేస్తున్నాడు. గుండెలను పిండి మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా చేస్తున్నాడు. ఇంతకీ ఏమిటా మహత్తు. మహేష్ నవ్వు వెనక దాగి ఉన్న మత్తు వంటి మహత్తు ఏంటి? అంటే... ఏమిటో..... అది తెలియని మహత్తు అని మురిసిపోతుంటారు మహేష్ అభిమానులు. ఇంకా... మహేష్ సొగసు చూసి పెళ్ళయిన అమ్మాయిలు కూడా ఫిదా అయిపోతుంటారు. ఇక మహేష్ సుతిమెత్తని డైలాగ్ లు, సినిమాలో చాలా షార్ఫ్ గా, మెత్తని చురకత్తుల్లా ఉండే మాటతీరు చూస్తే థియేటర్లో ఈల వేసి గోల చేయని ప్రేక్షకుడు కనపడడంటే ఒట్టు. ఒకరకంగా చెప్పాలంటే మహేష్ తెలుగు సినిమా రేంజ్ ని తారా స్థాయికి తీసుకెళ్ళి ఓవర్సీస్ లో కూడా ఎన్నడూ లేని విధంగా రికార్డులను సృష్టించిన హీరో. అలాంటి హీరో మహేష్ బాబు అందాన్ని, నవ్వు వెనుక ఉన్న మహత్తును పొగడ తరమా? ఏదో ఇల్లాంటి సందర్భాల్లో తప్ప. పుట్టినరోజు సందర్భంగా సినీజోష్.కామ్ తరఫున మహేష్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు.