ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కృష్ణ పుష్కరాల నిర్వహణ సవాలుగా మారింది. గోదావరి పుష్కరాలకి అధిక ప్రచారంతో హడావుడి చేసి 32మంది మరణానికి కారణమై అభాసుపాలైన బాబుకు.. కృష్ణ పుష్కరం నుండి బయటపడటం పెద్ద పరీక్షగా తయారైంది . పుష్కరాలకు వచ్చే లక్షల మంది భక్తులకు ఏ మాత్రం అసౌకర్యం కలగనీయకుండా తెదేపా తమ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది. అందుకోసమని విజయవాడ రోడ్లను విస్తరించడంలో భాగంగా సున్నితమైన సెంటిమెంట్స్ విషయాల జోలికి పోయి ప్రజాగ్రహానికి గురౌతుంది.
అనాది కాలం నుండి భక్తితో మొక్కుతున్న చిన్న చిన్న గుడులను, మసీదులను తొలగించి ప్రజలు విశ్వాసాలను మరింత దెబ్బతీసేలా వాటి స్థానంలో టాయ్ లెట్లు కట్టడం జరిగింది. దాంతో ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్ఆర్ సీపీ తీవ్రంగా వ్యతిరేకించింది. మరో చోట దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం కూడా తొలగించింది. ఈ విషయంలో కాంగ్రెస్- వైసీపీ ఒక్కటై తెదేపాపై పోరాటానికి అవకాశం కల్పించింది. ఇలా ప్రజల విశ్వాసాలుగా భావించే కొన్నిఅంశాలపై ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుందన్న అపవాదు ప్రజల్లో కలిగింది.
ఇంకా స్వాతంత్రం వచ్చిన తొలినాళ్ళలో పెట్టిన గాంధీ బొమ్మను కూడా ప్రభుత్వం అధికారుల చేత తొలగించి బుడమేరు కాలువలో గిరాటు వేయించింది. దీంతో ప్రజలు, నాయకులు ఆగ్రహానికి గురి కావడంతో స్థానిక కలెక్టర్ ఆ విగ్రహం బదులు మరో విగ్రహాన్ని చేయించి పెడతామని హామీ ఇవ్వడంతో ప్రజలు శాంతించారు. ఇలా ప్రభుత్వం ఒంటెద్దు పోకడతో గుడ్డిగా వ్యవహరిస్తుందన్న ఆలోచనలో కూడా విజయవాడ ప్రజలు ఉన్నారు. కాగా గోదావరి పుష్కరాల వలె ముందుచూపు లేకుండా ఎన్ని ఏర్పాట్లు చేసినా తెదేపా కొంప కొల్లేరయే ప్రమాదం ఉంది. ఈ పుష్కరాల తీరు విషయంలో చిన్న జీయర్ స్వామి కూడా ఘాటుగానే స్పందించారు. ఉత్తర భారతదేశంలోని హరిద్వార్, ప్రయాగ్, నాశిక్, ఉజ్జయిని వంటి కుంభమేళాలలో ఎటువంటి రాజకీయాలు చొరబడవని, దురదృష్టవశాత్తు కృష్ణపుష్కరాల్లో ఇలాంటి పరిణామాలు చవిచూడటం బాధాకరమని వెల్లడించారు. ఇటువంటి పరిస్థితిల్లో భక్తులకు ఆరాధనా భావం ఎలా కలుగుతుందని కూడా జీయర్ స్వామి వ్యాఖ్యానించారు. చివరగా తెదేపా తన రికార్డులను, ఘన చరిత్రను, రాబోవు ఎన్నికల ప్రచారంలో చూపించడానికి మళ్ళీ బోయపాటి శ్రీను కృష్ణ పుష్కర సమయంలో కెమెరా ఆన్ చేయడం లేదు కదా?