బాలీవుడ్‌లో ఓ స్టార్ సినిమా మొదలైందంటే వెంటనే ప్రారంభం రోజునే విడుదల తేదీని ప్రకటించేస్తారు. అడపాదడపా తప్ప వారి ప్లానింగ్ ఎంతో పర్‌ఫెక్ట్‌గా ఉంటుంది. కానీ టాలీవుడ్‌లో మాత్రం స్టార్స్ సినిమాలు రిలీజ్ డేట్స్‌ను ఏవో ఒకటి రెండు చిత్రాలకు ప్రకటిస్తున్నా కూడా దానిలో ఎక్కువశాతం చిత్రాలు అనుకున్న తేదీన కాకుండా వెనకాముందు అవుతున్నాయి. దీంతో చిన్న, మధ్యతరగతి సినిమాలు రిలీజ్ డేట్స్ విషయంలో సందిగ్దంలో పడిపోతున్నాయి. తాజాగా జూలైలో వస్తుందని ప్రకటించిన వెంకటేష్ 'బాబు బంగారం' చిత్రం ఆగష్టు12కు, అదే తేదీన విడుదలకావల్సిన 'జనతాగ్యారేజ్' సెప్టెంబర్2కు పోస్ట్‌పోన్ అయ్యాయి. ఇక తన చిత్రాలను ఏళ్లకు ఏళ్ళు చెక్కుతాడని పేరున్న జక్కన్న అలియాస్ రాజమౌళి తన 'బాహుబలి-ది బిగినింగ్' చిత్ర విషయంలో కూడా ఎన్నో తేదీలను ప్రకటించి, వాటిని వాయిదా వేస్తూ రిలీజ్ చేశాడు. ఇక 'బాహుబలి-ది కన్‌క్లూజన్' చిత్రం 2016లోనే వస్తుందని రాజమౌళి చెప్పాడు. ఆతర్వాత అది కాదు... 2017 ఏప్రిల్14న వస్తుందని ప్రకటించారు. తాజాగా ఈ చిత్రానికి రిలీజ్ డేట్ మరలా మారింది. రెండు వారాలు ఆలస్యంగా ఏప్రిల్ 28వ తేదీన విడుదలవుతుందని అంటున్నారు. మరి ఈ డేట్ అయినా ఫిక్స్ అవుతుందో? లేకపోతే మరోసారి వాయిదాల పర్వం కొనసాగుతుందో వేచిచూడాల్సివుంది.