రాజకీయాల్లో యువతకు తగిన ప్రాధాన్యం, ప్రోత్సాహం ఇవ్వాలన్న సదుద్దేశంతో ఆనందీబెన్ పటేల్ గుజరాత్ సియంగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత గుజరాత్ ముఖ్యమంత్రి పీఠాన్ని ఎవరు అధిష్టించనున్నారనే విషయంలో దేశమంతా ఉత్కంఠతతో ఎదురు చూడసాగింది. గత రెండు రోజులుగా ఈ విషయంలో మోడీ అనుమతి, అంగీకారాలతో భాజపా తర్జన భర్జనలు పడింది. మొత్తానికి ఈ ఉత్కంఠకు తెరదీస్తూ గుజరాత్ రాష్ట్రానికి నూతన ముఖ్యమంత్రిగా విజయ్ రూపానీని అధిష్ఠానం ఖాయం చేసింది.
గాంధీనగర్ లోని భాజపా పార్టీ కార్యాలయంలో భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, నితిన్ గడ్కరీలు రాష్ట్ర నాయకులతో సుదీర్ఘ మంతనాలు జరిపి ఎట్టకేలకు గుజరాత్ ముఖ్యమంత్రి ఎవరన్నది ప్రకటించారు. అసలు ఈ సమావేశాలు, అధిష్టాన వర్గాలు ఇవన్నీ ఏదో ఫార్మాలిటీస్ కే గానీ, మోడీ మనసులో ఏమీ లేకుండానే ఈ రాజకీయ పరిణామం చోటుచేసుకుందా. అందులో అదీ గుజరాత్ లో. అన్నీ పద్ధతి ప్రకారం ముందుగానే జరిగిపోయినై. తంతు అంతా ముందే జరిగింది కానీ తతంగం మాత్రం అంతా జరిగినట్టు తెలియాలి కాబట్టి జరిపారు అంతే. గుజరాత్ రాష్ట్ర నాయకులతో జరిపిన సమాలోచనలు, అధిష్టానం సంప్రదింపులు ఇదంతా ఆ ఫార్మాలిటీస్ లో భాగమే. కాగా మొత్తానికి ముఖ్యమంత్రిగా విజయ్ రూపానీని, ఉప ముఖ్యమంత్రిగా నితిన్ పాటిల్ ల పేర్లను భాజపా ఖరారు చేసింది. కాగా ఆగష్టు 7వ తేదీ ఆదివారం గుజరాత్ సీయంగా విజయ్ రూపానీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.