కేంద్రం ఇవ్వాల్సిన ప్రత్యేకహోదా ఇవ్వకపోవడంతో వైయస్సార్‌సీపీ, కాంగ్రెస్, వామపక్షాలు నిర్వహించిన బంద్ ఏపీలో పాక్షికంగా విజయవంతమైంది.. వాస్తవానికి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, అరుణ్‌జైట్లీ లను విమర్శించి, కేంద్ర ప్రభుత్వ సంస్దలు, కార్యాలయాలు, కేంద్రప్రభుత్వ ఉద్యోగులు, కేంద్రానికి సంబంధించిన రైళ్లను ఆపి బంద్ చేయాల్సిన ప్రతిపక్షాలు మరీ ముఖ్యంగా వైయస్సార్‌సీపీ నాయకులు మోదీని, ఇతరులను విమర్శించకుండా ఎంతసేపు చంద్రబాబుపైనే నిందలు మోపడాన్ని తెలుగుదేశం నాయకులు మండిపడుతున్నారు. అసలే ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉన్న ఏపీలో బంద్ చేసి ఆర్టీసీబస్సులను తిరగనివ్వకపోవడం వల్ల నిన్న ఒక్కరోజుకే ఆర్టీసీకి రూ.5 కోట్లమేర నష్టం వచ్చింది. ప్రతిపక్షాలకు, కాంగ్రెస్‌కు చివరకు అధికారంలో ఉన్న టిడిపికి కూడా ఏపీ ప్రత్యేకహోదాపై చిత్తశుద్ది ఉంటే రాష్ట్రంలో ఉన్న కేంద్రప్రభుత్వ ఉద్యోగులను, యూనియన్ నాయకులను అక్కున చేర్చుకొని.. కేంద్రానికి సంబంధించిన సంస్దలలో సహాయనిరాకణ చేయించాలి. లేదా తెలంగాణలో టిఆర్‌ఎస్, జేఏసీ నిర్వహించిన సకల జనులు సమ్మె వంటి దాన్ని ఏపీలో చేసి విజయం సాధిస్తే కేంద్రం తప్పకుండా కిందకు దిగివస్తుంది. అంతేకానీ మన ఆస్తులను మనం నాశనం చేసుకొని, మనకు వచ్చే ఆదాయాన్ని, ఆర్టీసీ బస్సులను మనకు మనమే నాశనం చేసుకోవడం కేవలం చిత్తశుద్ది లేని పార్టీలు చేస్తున్న పనిగా విశ్లేషకులు భావిస్తున్నారు.