ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంటే భారత ప్రధాని నరేంద్ర మోడీకి కాస్త భయంగానే భావిస్తున్నట్లు అనిపిస్తుంది. అలా భావించకపోతే ఎన్నికల సమయంలో ఆంధ్ర ప్రజల సాక్షిగా సాక్షాత్తు మోడీ నోటి నుండే ‘ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు’ అంటూ పలికిన మాటలు, ఆయన గారు గుప్పించిన హామీలు మొత్తం ఇప్పుడు తుంగలో తొక్కి మరీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఇదేదో చూడబోతే ఆలోచనకు అందని విషయం ఏదో లోలోపల నలుగుతున్నట్లు తెలుస్తుంది.
రాజకీయం అంటేనే ప్రతిదీ స్వార్థమే పరమార్థంగా చలామణి అవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ‘నీకది ఇస్తే నాకేంటంట’ అనే ఇచ్చుపుచ్చుకునే ధోరణి ఇక్కడ ప్రధాన సమస్యగా మారింది. ఒకవేళ భాజపా గాని ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇస్తే, భాజపా ఉనికికే ప్రమాదం ఏర్పడి తెదేపా ఇంకా బలపడిపోతుందనే భయం మోడీ కూటమికి నరనరాల్లో నాటుకొనిపోయినట్టుంది. అలాగే ఆంధ్రా నుంచి బాబు కేంద్రాన్ని కూడా శాశించే స్థాయికి చేరుకుంటే ముందు ముందు ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని కూడా మోడీ భయానికి కారణం కావచ్చు.
అసలు ప్రత్యేక హోదా విషయం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పుడే మన నాయకులకు గుర్తొస్తుంది. ఎందుకంటే దానికోసం మేము తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు ప్రజలు భావించేందుకు ప్రత్యక్ష సాక్షులవేగా. ఆంధ్రాలో భాజపా పాగా వేయడానికి మోడీ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాడా? లేకా హోదా హుళక్కే నంటూ ఊరిస్తూ కేంద్రం నాన్చుతుందా? క్షణ క్షణం పరిస్థితులను అంచనా వేస్తూ ఎటువంటి పరిస్థితినయినా తమకు అనుకూలంగా మార్చుకునేందుకు బాబు నిరంతరం పొంచి చూస్తూనే ఉంటారా? ప్రత్యేక హోదా ఇచ్చినట్లయితే తమ రాజకీయ మనుగడకే తీవ్రప్రమాదం ముంచుకొస్తుందని భయపడుతున్నారు పోరాటల ప్రతిపక్ష నాయకుడు జగన్. ఈ ముగ్గురి ఆధిపత్య పోరులో ప్రజలు, ప్రాంతం అభివృద్ధి సన్నగిల్లి ఆంధ్రాప్రాంతం తీవ్ర ప్రమాదంలో పడే పరిస్థితి ఏర్పడుతుంది.