ప్రఖ్యాత దర్శకుడు రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం బాహుబలి 2. వెండితెర జక్కన్న చక్కని శిల్పంలా చెక్కుతూ ఈ చిత్రాన్ని మలుస్తున్న తీరు ప్రేక్షకులకు ఆశ్చర్యాన్ని, అంతే విస్మయాన్ని రేపుతున్న విషయం తెలిసిందే. చాలా రోజుల నుండి రామోజీ ఫలింసిటీలో ఈ చిత్రం తాలూకూ షూటింగ్ నిర్విరామంగా జరుగుతున్న సంగతి విదితమే. అయితే ఈ చిత్రంలోని క్లైమాక్స్ కు సంబంధించిన ఫైట్ నభూతో నభవిష్యతి అన్న రీతిలో కనీ వినీ ఎరుగని విధంగా తీర్చదిద్దేందుకు దర్శక నిర్మాతలు నిరంతరం మధన పడుతూనే ఉన్నారు. చిత్రం నిర్మాణంలో సైతం ఏ ఒక్క ఆలోచన ఎవరి బుుర్రలో తళుక్కుమని మెరిసినా శరవేగంతో దాన్ని ఆచరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే బాహుబలి మొదటి భాగంలో చూపించిన మహిష్మతి రాజ్యం సెట్స్ మాత్రమే కాకుండా బాహుబలి2 కోసమని ఇంకా కొన్ని నూతనమైన సెట్స్ ను నిర్మించి మహిష్మతి రాజ్యాన్ని విస్తరించే దిశగా ప్రస్తుతం దర్శక నిర్మాతలు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది.
మహిష్మతి రాజ్య విస్తరణలో భాగంగా రామోజీ ఫిలింసిటీలో ఒక సెట్ కోసమని భారీ స్థాయిలో దాదాపు 500 మంది కార్మికులు రేయింబవళ్ళు శ్రమిస్తున్నట్లు సమాచారం. దీంతో బాహుబలి2 పై ప్రేక్షకుల అంచనాలు ఇంకా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.