రాజకీయాల్లో ఆత్మహత్యలే ఉంటాయి కానీ హత్యలు ఉండవంటారు. తాము చేసే తప్పిదాలే పార్టీలకు, నాయకులకు అద:పాతాళానికి తోసేస్తాయి. కాగా ప్రస్తుతం ఏపీలో చంద్రబాబు ప్రభుత్వ పనితీరుపై అప్పడే ప్రజాగ్రహం వ్యక్తమవుతోంది. ఇక ప్రతిపక్షంగా జగన్ వైసీపీ కూడా ప్రజలమద్దతును కోల్పోతున్నది. వచ్చే ఎన్నికలనాటికి కేవలం చంద్రబాబుపై ఉండే వ్యతిరేకతే జగన్‌కు ప్లస్ అవుతుంది. అంతేగానీ ప్రత్యేకంగా ప్రతిపక్షనేతగా జగన్ కూడా ప్రజల మనసులను గెలుచుకోలేకపోతున్నాడు. ఈ తరుణంలో ఏపీలో అధికార, విపక్షాలు విఫలమవుతున్న పరిస్థితులలో ప్రత్యామ్నాయం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ ఎన్ని చేసినా దానికి మరో దశాబ్దం పాటు ఏపీలో పరాభవం తప్పదనేది వాస్తవం. బిజెపి ఒంటరిగా ఏపీలో బలం తెచ్చుకోవాలని చూస్తోంది. కానీ ప్రత్యేకహోదా విషయంలో ఏపీ ప్రజలను మోసం చేసిన బిజెపిపై ఏపీ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇలాంటి పరిస్దితుల్లో పవన్ వచ్చే ఎన్నికలనాటికి కాకుండా ఇంకా ముందు నుంచే తన జనసేనను పటిష్టం చేయాలి. అలాగే ఏపీలో బలపడాలని చూస్తోన్న ఆమ్‌ఆద్మీపార్టీ, లోక్‌సత్తా వంటి భావసారూప్యత ఉన్న పార్టీలతో కలిసి ముందుకు వెళ్లితే ఏపీ ప్రజలు ఆ దిశగా పవన్ పార్టీకి మద్దతు తెలుపే అవకాశాలు మెండుగానే ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.