మిగిలిన ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో ఎంపీలందరూ బడా బడా పారిశ్రామిక వేత్తలు, వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్లే. వీరంతా కేంద్రంతో సఖ్యతగా ఉంటూ కాంట్రాక్ట్‌లు కొట్టేయడానికో, తమ వ్యాపార, వాణిజ్య అవసరాల కోసమో పాకులాడుతుంటారు తప్ప రాష్ట్రం కోసం ఏమీ చేయరు. అదే లోక్‌సభలో ఒకప్పుడు కేవలం ఇద్దరే ఉన్న ఎంపీలు (కేసిఆర్, విజయశాంతి) సభను మొత్తం స్తంభింపజేశారు. ఇక కేవలం నలుగురు ఎంపీలు ఉన్న ఆమ్‌ఆద్మీ పార్టీ కూడా తమ డిల్లీ ప్రజల మద్దతు కోసం పార్లమెంట్‌ను సమర్దంగా వాడుకొంటున్నారు. ఇక తమిళనాడు వంటి రాష్ట్రాల విషయంలో కూడా రాష్ట్రానికి సంబంధించిన ఏదైనా అంశం వస్తే పార్టీలకతీతంగా ఏకమైపోయి తమ సత్తా చూపిస్తారు . కాగా మన రాష్ట్రం నుండి ఏకంగా టిడిపికి చెందిన 14మంది ఎంపీలు ఉన్నప్పటికీ వీరు పార్లమెంట్‌లో తమ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే నోరు మెదపరు. రాష్ట్ర విభజన విషయంలో కూడా చిరంజీవి, పనబాక లక్ష్మీ, జెడి శీలం, దగ్గుబాటి పురందేశ్వరి, కావూరి సాంబశివరావు వంటి నాయకులు తమ చేతకాని తనానికి నిలవెత్తు సాక్ష్యం. లగడపాటి, హర్షకుమార్ వంటి కొందరు ఎంపీలు మాత్రమే పోరాడారు. మిగిలిన వారు అధిష్టానానికి కోవర్ట్‌లుగా వ్యహరించి... పదవులు కాపాడుకున్నారు. ఇప్పుడు టీడీపీ ఎంపీలు కూడా ఈ విషయంలో తామేమీ తక్కువ తినలేదని నిరూపిస్తున్నారు. సభలో ప్రత్యేకహోదాపై అరుణ్‌జైట్లీ ప్రకటన సమయంలో మన ఎంపీలు మరోసారి తమ చేతకానితనాన్ని నిరూపించుకున్నారు. మన ఎంపీల ప్రతిస్పందన పట్ల ఏకంగా చంద్రబాబు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నాడనే వార్తలు కూడా వస్తున్నాయి.