నిర్మాతలు చూస్తే రజనీకాంత్ 'కబాలి' చిత్రం మొదటివారంలో రూ.320 కోట్లు వసూలు చేసిందంటూ ప్రకటించారు. కానీ ఈ చిత్రం ఆడే థియేటర్లు ఖాళీగా ఉంటున్నాయని, ఈ సినిమా 'లింగా'కు అన్నయ్య అని, ఈ చిత్రంతో కూడా తమకు నష్టాలు తప్పేలా లేవని బయ్యర్లు, ఎగ్జిబిటర్లు వాపోతున్నారు. తెలుగు విషయానికే వస్తే ఈ చిత్రం తెలుగురైట్స్‌ను దాదాపు రూ.30కోట్ల పైచిలుకు రేటుకు నిర్మాతలు సొంతం చేసుకున్నారు. ఈ చిత్రానికి విడుదలకు ముందు భారీ హైప్ రావడంతో అడ్వాన్స్ బుకింగ్‌లు జరిగిపోయాయి. దాంతో ఈ చిత్రం తొలి రోజు రూ.9 కోట్లు వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. కానీ మొదటి షోకే ఫ్లాప్‌టాక్ రావడంతో వారం మొత్తం మీద మరో రూ.10కోట్లను మాత్రమే రాబట్టగలిగింది. ఈ చిత్రం టోటల్ రన్‌లో రూ.20కోట్లకు మించి రాబట్టడం కష్టమని, దీంతో తెలుగు వెర్షన్ నిర్మాతలకు కనీసం రూ.10కోట్లకు పైగానే నష్టాలు తప్పవని ట్రేడ్‌పండితులు విశ్లేషిస్తున్నారు. ఇక ఈ చిత్రం కూడా ఫ్లాప్ అయిందనే వాస్తవాన్ని రజనీకాంత్ అర్దం చేసుకున్నాడని, అందుకే తాజాగా జరిగిన సక్సెస్‌మీట్‌కు ఆయన దూరంగా ఉన్నాడని అంటున్నారు. ఈ కార్యక్రమానికి రజనీ వచ్చేది గ్యారంటీ అని తమిళ మీడియాలో ప్రచారం జరిగింది. కానీ చివరి క్షణంలో ఈ సక్సెస్‌మీట్‌కు రజనీ రాకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.