ఎన్టీఆర్ - కొరటాల కాంబినేషన్ లో 'జనతా గ్యారేజ్' సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కొరటాల శివ సినిమాలో ఒక అదిరి పోయే ఐటెం సాంగ్ ఉంటుందని కూడా తెలిసిన విషయమే. 'జనతా గ్యారేజ్' లో కూడా ఒక అదిరిపోయే ఐటెం సాంగ్ ఉందని .. ఆ ఐటెం సాంగ్ కోసం టాలీవుడ్ టాప్ హీరోయిన్ తమన్నాని అప్రోచ్ అయ్యారని... దానికి తమన్నా కూడా ఒకే చెప్పిందని ప్రచారం జరిగింది. అయితే సినిమా విడుదలకు పెద్దగా సమయం లేకపోవడం తో ఈ సాంగ్ ని ఒక్క రాత్రిలో చేసేయాలని చిత్ర యూనిట్ భావించిందట. ఇక ఐటెం సాంగ్స్ లో దిట్ట అయిన తమన్నా ఒక్క రాత్రి సాంగ్ షూటింగ్ కోసం 40 లక్షల పారితోషకం కూడా తీసుకుందని ప్రచారం జరిగింది. తీరా చూస్తే ఈ ఐటెం సాంగ్ లో ఎన్టీఆర్ సరసన నర్తించేందుకు తమన్నా సిద్ధం గా లేదని సమాచారం. అందుకే జనతా గ్యారేజ్ యూనిట్ మరో టాప్ హీరోయిన్ ని ఫైనల్ చేశారని తెలుస్తుంది. ఆమె ఎవరో కాదు ఎన్టీఆర్ సరసన 'బృందావనం, టెంపర్' చిత్రాలలో నటించిన కాజల్ అగర్వాల్. 'జనతా గ్యారేజ్' లో ఐటెం సాంగ్ కోసం ఆమెను అప్రోచ్ అవగా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని సమాచారం. కాజల్ కి ఐటెం సాంగ్ చెయ్యడం లో ఏ మాత్రం అనుభవం లేదు... ఆమెకు ఇదే మొదటి ఐటెం సాంగ్. ఇక ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా ఈ సాంగ్ కోసం చిత్ర యూనిట్ ప్రిపేర్ అయ్యిపోయిందట. ఈ సాంగ్ తో 'జనతా గ్యారేజ్' సినిమా షూటింగ్ అంతా కంప్లీట్ అవుతుందని... ఈ సినిమా పాటలను ఆగష్టు 13 న విడుదల చేసి సినిమాని సెప్టెంబర్ 2 విడుదల చెయ్యడానికి టీమ్ రెడీ అవుతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యామీనన్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.