స్టార్ హీరోలు, తెలిసిన నిర్మాతలు, పెద్ద పెద్ద బేనర్లు, సంచలన దర్శకులు ఉంటే తప్పితే సినిమాలు ఆడవని ఓ వర్గం సినీ వర్గాల అభిప్రాయం. కానీ ఒక అనామక హీరో, అందునా ఎలాంటి అంచనాలులేని ఓ డబ్బింగ్ చిత్రంగా విడుదలైన 'బిచ్చగాడు' చిత్రం సాధిస్తోన్న విజయం చూసి ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. సినిమాలో దమ్ము, కంటెంట్ ఉంటే ఎలాంటి సినిమానైనా ప్రేక్షకులు ఆదరించి, పట్టం కడుతారనే దానికి 'బిచ్చగాడు' చిత్రాన్ని ఓ ఉదాహరణగా చెప్పుకోవాలి. కోట్లు కలెక్ట్ చేస్తున్న స్టార్ హీరోల చిత్రాలు కూడా రెండో వారం కల్లా చేతులెత్తేస్తున్నాయి. కనీసం 50రోజులు ఆడటం కూడా అరుదైపోయింది. 50 రోజులు ఆడినా కూడా అది ఏదో ఐదారు థియేటర్లలోనే. కానీ 'బిచ్చగాడు' చిత్రం మాత్రం 75రోజులు పూర్తి చేసుకొని శతదినోత్సవం వైపు అడుగులు వేస్తోంది.ఈ చిత్రం ఏకంగా 200 థియేటర్లలో 75రోజులు పూర్తి చేసుకోవడాన్ని అద్భుతమే అనాలి. మరి ఈ చిత్రం ఎన్ని థియేటర్లలో శతదినోత్సవం పూర్తి చేసుకుంటుందో వేచిచూడాల్సివుంది.