తొలి రోజు 'కబాలి'ని చూసినవాళ్లంతా పెదవి విరిచేశారు. కథలో కానీ, కథనంలోకానీ కొంచెమైనా కొత్తదనం లేదే అని నిరుత్సాహపడిపోయారు. సాక్షాత్తూ రజనీ ఫ్యాన్స్ కూడా అదే మాటన్నారు. కొద్దిమందైతే ప్రేక్షకులకు నచ్చకపోవడానికి కారణం విపరీతమైన హైపేనని తేల్చేశారు. ఆకాశమే హద్దుగా పెరిగిన అంచనాలవల్ల సినిమాకి భారీ నష్టాలు తప్పవని, గత చిత్రాల తరహాలో మళ్లీ రజనీకి తలనొప్పులు ఖాయమని మాట్లాడుకొన్నారు. అయితే 'కబాలి' విషయంలో రివర్స్‌గా జరిగింది. సినిమాకి ఏదైతే మైనస్‌గామారుతుందనుకొన్నామో అదే ప్లస్సయ్యింది. పెరిగిన అంచనాలే ఆ సినిమాని కాపాడాయని ట్రేడ్ వర్గాలు చెబుతుండడం విశేషం. కనీ వినీ ఎరుగని స్థాయిలో అంచనాల వల్ల ప్రేక్షకులంతా అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకొన్నారు. మూడు రోజులపాటు థియేటర్ల దగ్గర హౌస్‌ఫుల్ బోర్డులే దర్శనమిచ్చేలా వాళ్లు ముందుస్తుగానే టిక్కెట్టు కొని పెట్టుకొన్నారు. దీంతో వసూళ్లు పడిపోవడమనే ప్రసక్తే లేకుండా తయారైంది. సినిమా టాక్‌తో సంబంధం లేకుండా మూడు రోజులు జనాలు ఫుల్లుగా చూసేస్తారన్నమాట. అసలే తక్కువ బడ్జెట్టుతో తెరకెక్కిన కబాలికి అంతకుమించి ఇంకేం కావాలి? భారీ బడ్జెట్టుతో తెరకెక్కిన చిత్రమైతే నష్టాలు తప్పేవి కావు, కబాలి తక్కువ బడ్జెట్టుతో తెరకెక్కిన చిత్రం కాబట్టి విపరీతమైన హైప్స్ వల్ల తొలి రోజే భారీగా వసూళ్లు వచ్చాయి. ఈ హైప్ లేకపోయుంటే ఫ్యాన్స్ చూసే తొలి ఆట తర్వాతే వసూళ్లు పడిపోయేవి. కానీ హైప్ వల్ల అడ్వాన్సు బుకింగులు జరిగిపోవడంతో బయ్యర్లంతా సేఫ్ సైడ్ అయిపోయారు. వ్యాపారం పరంగా చూస్తే రజనీకి బ్లాక్ బస్టర్ పడ్డట్టే.