టాలీవుడ్ చరిత్రలో ఓ విజువల్ వండర్‌గా రూపొంది, కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన 'బాహుబలి' చిత్రంపై ఇంతకుముందు పలువురు సీనియన్ ఆర్టిస్ట్ లు తీవ్రవిమర్శలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా తెలుగు వారు గర్వించదగ్గ సీనియర్ ఆర్టిస్ట్ కైకాల సత్యనారాయణ కూడా 'బాహుబలి'పై తీవ్రవిమర్శలు చేశారు. ఆయన ఇటీవల ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, అసలు 'బాహుబలి'లో ఏముంది? ఏదైనా మంచి డైలాగ్ ఉందా? ఆహ్లాదరకమైన సంగీతం ఉందా? అద్భుతమైన కథ ఏమైనా ఉందా? ఇలాంటి యుద్ద సన్నివేశాలను గతంలో విఠలాచార్య గారు తీశారు. గతంలో ఇలాంటి ఫైట్స్‌ను ట్రిక్స్ అనే వారు. ఇప్పుడు గ్రాఫిక్స్ అంటున్నారు. అంతే తేడా? దీనికోసం కోట్లు కుమ్మరిస్తున్నారు. కోట్ల మంది చూసే సినిమా సొసైటీకి ఉపయోగపడాలి. సినిమా అనేది ఎంటర్‌టైన్‌మెంటే.. దానిని నేను కాదనడం లేదు. కేవలం ఎంటర్‌టైన్‌మెంట్‌కు కోట్లు ఖర్చుపెట్టాల్సిన అవసరం లేదు. ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తూనే సొసైటీకి, ప్రజలకు అంతర్గతంగా ఏమైనా మంచి చెప్పాలి.. అంటూ తన అభిప్రాయాన్ని తెలిపారు.