ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, నాయకులను పిలిచి మరీ ఆహ్వానిస్తున్న తెలంగాణలోని టిఆర్‌ఎస్, ఏపీలోని టిడిపి పార్టీలకు ఇప్పుడు చేదువార్త వినిపించింది. వచ్చే ఎన్నికల నాటికి అసెంబ్లీ స్దానాలు పెరుగుతాయని భావించి, ఇటు తమ పార్టీ స్దానిక నేతలను, వలస వచ్చిన నాయకులనూ ఊరిస్తూ వస్తున్న ఈ రెండురాష్ట్రాల ముఖ్యమంత్రులకు కేంద్రం ఝలక్ ఇచ్చింది. 2014 ఆంధ్రప్రదేశ్ పున: విభజన చట్టం ప్రకారం ఏపీ, తెలంగాణల్లో అసెంబ్లీ స్దానాలను పెంచాల్సి ఉన్నప్పటికీ 2026లో జనాభా లెక్కలు వచ్చేంత వరకు ఏ రాష్ట్రంలో కూడా అసెంబ్లీ స్దానాలను పెంచవద్దనే నిబంధన ఉన్నందున ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ నియోజకవర్గాలను పెంచడం సాధ్యం కాదని కేంద్రం హైకోర్టుకు తెలియజేసింది. దీంతో అధికార పార్టీల్లోకి వచ్చిన వలస నాయకులకు ఇది షాక్ కాగా, ఏపీలో వైసీపీ, తెలంగాణలో కాంగ్రెస్ వంటి పార్టీలకు మాత్రం ఇది సంతోషాన్ని కలిగించే విషయమే అని అంటున్నారు.