ఏపీలో టిడిపి అధికారంలో ఉంది గనక దానిలో చేరితో ఏదో ఒక పదవి దక్కుతుందన్న ఆశతో వైసిపి నుండి కాంగ్రెస్ నుండి కొంత మంది నేతలు టిడిపి కి వలస వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణలో టీఆరెస్ ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ట్ చేసి టిడిపి నుండి కాంగ్రెస్ నుండి అందరి ఎమ్యెల్యేలని టిఆర్‌ఎస్ లోకి తెచ్చేసుకున్న తర్వాత ఇక ఏపీ లో కూడా టిడిపి అదే పనిని మొదలు పెట్టింది. ఏపీలో టిడిపి ఆకర్ష్ కి లొంగి దాదాపు వైసిపిలో ని 15 మంది ఎమ్మెల్యే ల వరకు టిడిపిలో చేరిన సంగతి తెలిసిందే. అసలు వీరికి ఏదో ఒక పదవి గానీ, లేక కొంత డబ్బు గాని టిడిపి ముట్ట చెప్పిందని అందుకే వైసిపి నుండి వీరు టిడిపిలోకి జంప్ అయ్యారని వైసిపి అధ్యక్షుడు జగన్ ఎంత మొత్తుకున్నా టిడిపి అస్సలు లెక్కచేయ్యలేదు. అయితే ఇలా టిడిపిలో కి వచ్చిన వారికి సీనియర్స్ కొంత మందికి ఎమెల్సీ, మరికొంత మందికి రాజ్యసభ సీటు ఇచ్చి వారిని సంతోషపెట్టింది. ఇక మిగిలిన వారికి కూడా ఏదో ఒకటి ఏర్పాటు చేస్తానని వారికి హామీ ఇచ్చారని అప్పట్లో అనుకున్నారు. అయితే ఈ మధ్య చంద్రబాబు తన కేబినెట్ ని మంత్రివర్గ విస్తరణ చేస్తానని చెబుతున్నారు.
ఇక విస్తరణ జరిగితే టిడిపి లో చేరిన మరి కొంతమంది వైసిపి ఎమ్యెల్యేలు కూడా మంత్రి పదవి లభిస్తుందని ఆశ పడుతున్నారు. అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం వైసిపి నుండి వచ్చిన ముగ్గురు ఎమ్యెల్యేలను కేబినెట్లోకి తీసుకుంటున్నారని సమాచారం. వారిలో ఈ మధ్యే టిడిపిలోకి చేరిన కర్నూలుకి చెందిన భూమా నాగిరెడ్డి ఒకరు కాగా మరొకరు జ్యోతుల నెహ్రూ అని ఇంకొకరు కృష్ణాకు చెందిన జలీల్ ఖాన్ కి మంత్రి పదవులు రావడం ఖాయమని ప్రచారం జోరుగా సాగుతుంది. వీరికి మంత్రి పదవులు ఇవ్వడం ద్వారా వైసిపి ఎమ్యెల్యేలను సంతృప్తి పరచ వచ్చని.. ఇదే జరిగితే రెడ్డి, కాపు, ముస్లిం వర్గాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లి తనకు ఆయా వర్గాల్లో మరింత క్రేజ్ వస్తుందనే ఉద్దేశ్యంలో బాబు ఉన్నట్లు చెబుతున్నారు. ఇలా చంద్రబాబు గనక వైసిపి జంపింగ్ ఎమ్యెల్యేలకు మంత్రి పదవులిస్తే మరికొంతమంది వైసిపి నుండి టిడిపిలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.