వయసు పెరిగే కొద్ది గ్లామర్ పెంచుకుంటున్న సీనియర్ స్టార్.. నాగార్జున. ఆయన కెరీర్ ప్రస్తుతం కూడా పీక్స్‌లోనే ఉంది. 'మనం, సోగ్గాడే చిన్నినాయనా, ఊపిరి' వంటి విభిన్న చిత్రాలతో ఆయన తన రేంజ్‌ను పెంచుకుంటూ పోతున్నాడు. కాగా నాగ్ పెద్ద సినిమాలనే కాదు.. చిన్న సినిమాలను కూడా బాగా ప్రోత్సహిస్తుంటాడు. ఆమధ్య 'ఉయ్యాల జంపాల' నిర్మించిన నాగ్ ప్రస్తుతం హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్‌ను హీరోగా పరిచయం చేస్తూ జి.నాగకోటేశ్వరరావు దర్శకత్వంలో 'నిర్మలా కాన్వెంట్' చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అంతేకాదు.. ఈ చిత్రంలో ఆయన ఓ కీలకపాత్రలో కనిపించనున్నాడు. ఇటీవల నాగ్ ఈనెల 23వ తేదీన మీకు ఓ సర్‌ప్రైజింగ్ ఇస్తానంటూ ట్వీట్ చేశాడు. ఆ రోజున ఆయన తాను నటిస్తున్న'నిర్మలాకాన్వెంట్'లోని సీన్స్‌నో, లేక సాంగ్‌నో అందిస్తాడని కొందరు భావిస్తుంటే మరికొందరు మాత్రం 23 వతేదీన ఆయన తన కుమారులైన నాగచైతన్య, అఖిల్‌ల వివాహం విషయం తెలియజేస్తాడంటున్నారు. మరి ఆయన ఇచ్చే సర్‌ప్రైజ్ ఏమిటో రేపు తేలిపోనుంది.