ఒక సినిమా విడుదలవుతుంది అంటే.. అది పైరసీ అయిపోయి వెంటనే అందరికి సిడి, డివిడి రూపంలో అందుబాటులోకి వచ్చేస్తుంది. మరి అలా సినిమాలు పైరసీ అవ్వడం వలన సినిమాలకు కోట్లు ఖర్చు పెట్టిన నిర్మాతలు భారీగా నష్టపోతున్నారు. పోనీ పైరసీ చేస్తున్న వెబ్ సైట్స్ ని ఏమన్నా పట్టుకుని మూయిస్తున్నారా అంటే అది ఎవరి వల్ల కావడం లేదు. కానీ దాని వల్ల నష్టపోయిన నిర్మాతలు మాత్రం ఎప్పటికప్పుడు పోరాడుతూనే వున్నారు. అయితే సినిమాలని ఆన్ లైన్ లో పైరసీ చేస్తున్న వాటిలో అతి పెద్ద వెబ్ సైట్ 'కిక్యాస్ టోరెంట్స్'. ఈ సైట్ యజమాని 'అర్టెమ్ వాలెన్' . ఇతను కోట్ల విలువ చేసే సినిమాలు, సాంగ్స్ ని చట్టవిరుద్ధం గా కాపీ చేసి తన వెబ్ సైట్ లో ఉంచుతాడు. అప్పుడే విడుదలైన సినిమాలు కూడా ఈ సైట్ లో దర్శనమిస్తాయి. ఇక ఆ సినిమా మరియు సాంగ్స్ అన్నీ పైరసీ రూపం లో ఇంకొన్ని సైట్స్ లో దర్శనమిస్తాయి. అయితే 'కిక్యాస్ టోరెంట్స్'ని నడుపుతున్న వ్యక్తిని నిన్న (గురువారం) పోలెండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతనిపై పోలెండ్ పోలీసులు మనీలాండరింగ్ మరియు కాపీ రైట్స్ చట్టం ఉల్లంఘన వంటి కేసులు నమోదు చేశారు. ఇదిలా ఉంటే ప్రపంచం మొత్తం ఎంతో ఎదురు చూస్తున్న 'కబాలి' సినిమా ఈ రోజు(జులై 22) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాని నిర్మాత కలైపులి థాను ఎంతో ప్రతిష్టాత్మకం గా తెరకెక్కించాడు. మరి ఈ సినిమా మొదటి షో నుండే మిశ్రమ స్పందనతో థియేటర్స్ లో రన్ అవుతుంది. అయితే 'కబాలి' విడుదలకు ఒక్క రోజు ముందే పైరసీ వెబ్ సైట్ ఓనర్ అరెస్ట్ అవ్వడం, ఆ సైట్ ని మూయించడం వంటివి 'కబాలి' కి కలిసొచ్చే అంశాలు. కానీ ఒక్కరి అరెస్ట్ తో పైరసీ ఆగేది కాదు కాబట్టి కబాలి యూనిట్ ఈ పైరసీ విషయంలో మరికొన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే.. మిశ్రమ స్పందన వస్తున్న ఈ సినిమా మంచి ఫలితాన్ని సాధించే అవకాశం ఉంటుంది.