నవజ్యోత్‌సింగ్ సిద్దు.... ఓ క్రికెట్ దిగ్గజం... ఒంటి చేత్తో భారత్‌కు ఎన్నో విజయాలు అందించిన ధీశాలి. క్రికెట్ నుండి రిటైర్ అయిన తర్వాత బిజెపిలో చేరి ఆ పార్టీ ఎంపీగా అమృతసర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎన్నికైనాడు. ఈయన కేవలం క్రికెట్ ఆడటంలోనే కాదు... అనర్గళంగా మాట్లాడగలిగిన క్రికెట్ కామెంటేటర్. రాజకీయాల్లో కూడా మంచి ఉపన్యాసాలు చెప్పగల దిట్ట. ప్రజాసేవకు,నియోజకవర్గ అభివృద్దికి బాగా కృషి చేశాడని పేరుంది. అందుకే సిద్దుకు అమృతసర్ ప్రజలు రెండుసార్లు ఘనవిజయం అందించారు. కాగా 2014 ఎన్నికల్లో సిద్దు ను అమృతసర్ నుండి పోటీ చేయవద్దని, ఆ స్దానాన్ని ఆర్దిక మంత్రి అరుణ్‌జైట్లీకి ఇవ్వాలని బిజెపి హైకమాండ్ హుకుం జారీ చేసింది. దీంతో సిద్దు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. అక్కడ పోటీ చేసిన అరుణ్‌జైట్లీ ఓటమిపాలయ్యాడు. కాగా రెండు నెలల కిందట ఆయనకు బిజెపి అధిష్టానం రాజ్యసభ సీటును ఇచ్చింది. కానీ సిద్దుకు మాత్రం బిజెపి అధిష్టానంపై తీవ్రమైన కోపం వచ్చింది. మంచి పరిపాలనాధ్యక్షుడు కాగల ఈయన ఇప్పుడు ఆమ్ ఆద్దీపార్టీ (ఆప్) కన్వీనర్ కేజ్రీవాల్ దృష్టిని ఆకర్షించాడు. ఈ సారి ఎన్నికల్లో ఎలాగైనా పంజాబును చేజిక్కించుకోవాలని కేజ్రీవాల్ తీవ్రంగా శ్రమిస్తున్నాడు. పంజాబ్ రాష్ట్రంలో ఆయన ఎన్నో నూతన ఒరవడులకు తెరతీస్తానని ప్రకటించాడు.దీంతో పంజాబ్‌లో ఆప్‌కు ప్రజల నుండి మంచి స్పందనే వస్తోంది. దీంతో రాబోయే ఎన్నికల్లో పంజాబులో గెలిస్తే సిద్దును ముఖ్యమంత్రిని చేస్తానని కేజ్రీవాల్ అభయం ఇచ్చినట్లు తెలుస్తోంది. దాంతో సిద్దు తన రాజ్యసభ పదవికి, బిజెపికి రాజీనామా చేసి ఆప్‌కు అండగా నిలబడాలని నిర్ణయించుకున్నాడు. పంజాబులో బిజెపి మిత్రపక్షంగా అధికారంలో ఉన్న అకాళీదళ్ తరపున ఎమ్మెల్యేగా ఉన్న సిద్దు భార్య కూడా తన పదవికి రాజీనామా చేసింది. సో.. త్వరలోనే సిద్దు అతని భార్య ఆప్‌లో చేరి కేజ్రీవాల్‌కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. వచ్చే ఏడాది జరగనున్న ఉత్తర ప్రదేశ్ ఎన్నికలపైనే దృష్టి పెట్టిన మోడీ అండ్ కోకు సిద్దు షాక్ ఇచ్చాడనే చెప్పవచ్చు. ప్రస్తుతానికి మాత్రం పంజాబ్‌లో ఆప్‌కు సానుకూల పవనాలు వీస్తున్నాయని సమాచారం.