బాలీవుడ్ కాస్య్టూమ్ డిజైనర్ నీతా లుల్లా 'గౌతమిపుత్ర శాతకర్ణి' చిత్రానికి పనిచేస్తుందని చిత్ర నిర్మాతల ప్రకటించారు. 'గౌతమిపుత్ర..' కోసం ఇప్పటికే రెండు ప్రధాన షెడ్యూల్స్ పూర్తయ్యాయి. తాజాగా మూడవ షెడ్యూల్ జోర్దన్ లో జరుగుతోంది. క్లయిమాక్స్ చిత్రీకరిస్తున్నారు. అంటే చాలా ఇంపార్టెంట్ ఎపిసోడ్ అన్నమాట. మరి ఈ మూడు షెడ్యూల్స్ కు కాస్ట్యూమ్స్ డిజైనింగ్ ఎవరు చేశారు?. మూడవ షెడ్యూల్ జరుగుతుండగా నీతా పేరును ఎందుకు ప్రకటించారు?. పక్కా ప్లానింగ్ తో సినిమా తీస్తున్నామంటూ దర్శకుడు పలు సందర్భాల్లో చెప్పారు. మరి హడావుడిగా నీతా లుల్లా ఎంపిక ఎందుకుజరిగింది. దీనిపై దర్శకుడే స్పష్టత ఇవ్వాలి. ఏ సినిమాకైనా సరే కాస్ట్యూమ్స్ డిజైనింగ్ షూటింగ్ మెుదలు పెట్టకముందే చేస్తారు. ఆ తర్వాత వాటిని కుట్టిస్తారు. రెడీ అయ్యాక షూటింగ్ కు వెళతారు. సినిమా గురించి కనీస నాలెడ్జ్ ఉన్నవారెవరికైనా తెలిసిన విషయమే ఇది.
'జోథాఅక్బర్' చిత్రానికి నీతాలుల్లా చేసిన డిజైన్స్ ఆమెకు పేరు తెచ్చిపెట్టాయి. దాంతో చారిత్రక నేపథ్యంతో తీసిన 'రుద్రమదేవి' చిత్రానికి సైతం నీతా లుల్లాను తీసుకున్నారు. కాబట్టి 'గౌతమిపుత్ర' కు మాత్రమే ఆమె వర్క్ చేస్తుందనే విధంగా హడావుడి ఎందుకో.
నిజానికి జానపద, చారిత్రాత్మక చిత్రాలు నిర్మించడంలో తెలుగువారికంటే మరెవరూ బెటర్ కాదు. ఎన్నో వందల సినిమాల నిర్మాణం టాలీవుడ్ లో జరిగింది. ఇక్కడి టెక్నీషియన్స్ అలనాటి నేపథ్యాన్ని సృష్టించడంలో ఘనులు. రామ్ చరణ్ నటించిన 'మగధీర'లో కూడా కొంతభాగం జానపద నేపథ్యం ఉంటుంది. ఈ సినిమాకు దర్శకుడు రాజమౌళి సతీమణి రమా కాస్ట్యూమ్స్ డిజైన్ చేశారు. ఆమెకు సైతం మంచి గుర్తింపు వచ్చింది. బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ గా 'నంది పురస్కారం' (2012) సైతం రమకు లభించింది.