మాజీ అందాల నటి సుమలత ఒక ఇంటర్య్వూలో తనను 'ప్రతిఘటన' సినిమాలో నటించాల్సిందిగా అడిగారని, డేట్స్ లేనందున కుదరలేదని వెల్లడించింది. విజయశాంతి నటించిన 'ప్రతిఘటన' సినిమా గురించే ఆమె చెప్పింది. సుమలత చెప్పింది నిజమేనా!! అనే డౌట్ చాలామందికి వచ్చింది. ఎందుకంటే 'ప్రతిఘటన' (1985) విజయశాంతికి స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. ఉషాకిరణ్ మూవీస్ లో తొలి భారీ విజయం సాధించింది. కోట శ్రీనివాసరావు, చరణ్ రాజ్ లకు లైఫ్ ఇచ్చింది. ఈ చిత్రానికి టి.కృష్ణ దర్శకత్వం వహించారు. ఆయన రేంజ్ అమాంతం పెరిగింది. ఇన్ని సంచలనాలకు కేంద్రబిందువులైన 'ప్రతిఘటన' ఆఫర్ తొలుత తనకే వచ్చిందని సుమలత చెప్పడం నిజం కాదనే మాట కూడా వినిపిస్తోంది.
దర్శకుడు టి.కృష్ణ ఆరు అభ్యుదయ భావాల కథాంశాలతో చిత్రాలు తీశారు. ఆయన మెుదటి సినిమా 'నేటి భారతం'లో విజయశాంతి నటించింది. ఆ తర్వాత 'దేశంలో దొంగలు పడ్డారు', 'దేవాలయం', 'వందేమాతరం', 'ప్రతిఘటన', 'రేపటి పౌరులు' చిత్రాలకు దర్శకత్వం వహించగా అన్నింటిలో విజయశాంతి నటించింది. ఆయన రెగ్యులర్ హీరోయిన్ విజయశాంతి. కాబట్టి సుమలత చెప్పిన విషయం నిజమయ్యే అవకాశం లేదు.