నటి త్రిష తన నిర్మాతకు నోటీసు ఇచ్చిందని చెన్నై, హైదరాబాద్ లో వినిపిస్తోంది. హీరోయిన్లు నోటిసులు ఎందుకిస్తారంటే తమ పారితోషికం రాబట్టుకోవడానికి. త్రిష కూడా అదే పనిచేసిందట. త్రిష నటించిన 'నాయకి' గత శుక్రవారం రిలీజైంది. తెలుగు, తమిళ భాషల్లో తీసిన ఈ చిత్రానికి ఆమె మేనేజర్ నిర్మాతగా వ్యవహరించారు. పారితోషికంగా తమిళ హక్కులు త్రిషకు ఇచ్చారని తెలిసింది.
కానీ 'నాయకి' సినిమా నిర్మాణ ఖర్చు పెరిగి లెక్కలన్నీ మారాయి. ఖర్చుకు తగినట్టుగా బిజినెస్ జరగలేదు. దాంతో రిలీజ్ కు ఇబ్బంది ఎదురైంది. ఈ క్రమంలో తమిళ హక్కుల వల్ల తను ఆశించిన పారితోషికం రాలేదని, అందువల్ల బ్యాలెన్స్ చెల్లించాల్సిందంటూ చెన్నై కోర్టులో త్రిష కేసు వేసినట్టు సమాచారం. అయితే లక్కీగా కేసు నోటీసులు సకాలంలో చేరకపోవడంతో సినిమా రిలీజ్ కు బ్రేక్ పడలేదు.
త్రిషను నమ్ముకుని సినిమా తీసిన మేనేజర్ కు చుక్కలు కనిపించాయి. త్రిషతో హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా తీస్తే వ్యాపారం బాగా జరుగుతుందని భావిస్తే రివర్స్ అయింది. పైగా త్రిష నోటీసులు ఇచ్చిందని తెలిసి అవాక్కయ్యాడు సదరు నిర్మాత. హీరోయిన్లకు సెంటిమెంట్ ఉండదు. తన, పర అనే భేదం ఉండదని మరోసారి స్పష్టమైంది.