ఎన్టీఆర్-కొరటాల శివ కలయికలో రూపొందుతున్న చిత్రం జనతా గ్యారేజ్‌పై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇటీవల విడుదలైన టీజర్‌తో ఎక్స్‌పెక్టేషన్స్ మరింత పెరిగాయి. అయితే ఇక్కడ అన్నీ రిపేరు చేయబడును అనే ఈ చిత్రం ఉపశీర్షిక.. మొదటగా ఈ చిత్రానికే సరిపోతుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. తొలుత ఈ చిత్రాన్ని ఆగస్టు 12న విడుదల చేస్తామని దర్శక, నిర్మాతలు ప్రకటించారు. అయితే అంచనాలకు తగిన విధంగా చిత్రం రాకపోవడంతో చిత్రానికి రిపేర్లు మొదలుపెట్టారని ఫిల్మ్‌నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలు అంతగా సంతృప్తికరంగా రాకపోవడంతో రీషూట్ చేయడానికి చిత్ర విడుదలను సెప్టెంబర్ 2కు వాయిదా వేశారని వార్తలు వినిపిస్తున్నాయి. దర్శకుడు కొరటాల శివ కూడా సినిమా బెటర్‌గా రావడానికి రీషూట్‌లు చేస్తే తప్పేంటి అని శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో చెప్పడంతో.. ఇక జనతా గ్యారేజ్‌కు రిపేర్లు చేస్తున్నారనే విషయం స్పష్టమైందని అంటున్నారు సినీజనాలు.