తమిళనాడులో కాంగ్రెస్‌కు పెద్దగా పట్టులేదు. గత ఎన్నో సంవత్సరాలుగా రాష్ట్రంలో కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలని శతవిధాలా ప్రయత్నిస్తూ ఏదో ఒక ప్రాంతీయ పార్టీతో అంటే డీఎంకే లేదా అన్నాడిఎంకేలతో పొత్తు రాజకీయాలు చేస్తున్నా కూడా అక్కడ కాంగ్రెస్‌కు ఏమాత్రం మద్దతు పెరగడం లేదు. ఇన్నేళ్ల కాలంలో ఎందరో మహామహులను కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులుగా నియమించినప్పటికీ ఫలితం మాత్రం ఉండటం లేదు. ఏపీలో బిజెపిలో వెంకయ్యనాయుడు ఎలానో, తమిళనాడులో చిదంబరంది కూడా అదే పరిస్థితి. కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఇక తమిళనాడు రాజకీయాలన్ని కేంద్రంలో చిదంబరం చుట్టూనే తిరుగుతాయి. కాగా ఇటీవల ఈ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఇళంగోవన్ పదవి కాలం ముగిసింది. దీంతో అక్కడ తదుపరి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు? అనే దానిపై చర్చ జరుగుతోంది. మరలా ఇళంగోవన్‌కే పగ్గాలు ఇవ్వాలని పార్టీలోని ఓ వర్గం భావిస్తోంది. మరోపక్క తమిళనాడులో సినీ నటులు రాజకీయాల్లో బాగా రాణిస్తారనే భ్రమలో ఉన్న కాంగ్రెస్ ఒకప్పటి తమిళ ప్రేక్షకుల ఆరాధ్యదేవత ఖుష్బూకు ఈ పదవి ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ఆమెను కాంగ్రెస్ అధిష్ఠానం ఢిల్లీకి పిలిపించింది. అక్కడ సోనియా, రాహుల్‌లతో కూడా ఆమె మంతనాలు జరిపింది. దీంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే చిదంబరం ఒప్పుకుంటే ఆయనకే పగ్గాలు అందించాలని అధిష్టానం భావిస్తున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఈ రేసులో ఎవరికి ఈ పదవి దక్కుతుందో అంటూ పలు కథనాలు మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.