ఏపీ రాజధాని అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇప్పుడు భూముల క్రయవిక్రయాలు ఊపందుకున్నాయి. ప్రతిరోజు కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి. ఈ నేపథ్యంలో దొంగనోట్ల ముఠాలు కూడా అమరావతిపై కన్నేసినట్లు కనిపిస్తోంది. బంగ్లాదేశ్ సరిహద్దుల నుండి ఈ దొంగనోట్లు దేశంలోకి ప్రవేశిస్తూ ఏపీ రాజధాని అమరావతిపై కన్నేస్తున్నాయని సమాచారం. ఇటీవలే గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో రెండు అతి పెద్ద దొంగల ముఠాలను పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలి కరెన్సీని గుర్తించే మిషన్లు తప్ప మరెవ్వరూ కనిపెట్టలేని విధంగా ఈ నోట్లు ముద్రిస్తున్నారు. ఎక్కువగా రూ.500, రూ.1000ల నోట్లు చలామణిలో ఉండటంతో వీటిని ఎవ్వరు గుర్తించలేకపోతున్నారు. ఈ దొంగనోట్ల ముఠాలు కమిషన్ లెక్కన పలువురిని ముగ్గులోకి దించి వాటిని చలామణిలో ఉండేలా ప్లాన్ చేస్తున్నాయి. భూములు క్రయవిక్రయాలన్నీ బ్లాక్‌మనీతోనే జరుగుతుండటంతో మోసపోయిన వారు కూడా నోరు విప్పలేకపోతున్నారు. కాబట్టి సామాన్యులు దొంగనోట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.