దర్శకధీరుడు రాజమౌళి తన చిత్రాల షూటింగ్ సమయంలో చాలా కఠినమైన రూల్స్ ఫాలో అవుతుంటాడు. తన చిత్రాల్లోని విజువల్స్ బయటకు రాకుండా ఉండటం కోసం యూనిట్ సభ్యులకు కఠిన నిబంధనలు పెడుతుంటాడు. కాగా ఇప్పుడు దర్శకేంద్రుడు, రాజమౌళి గురువు అయినా కె.రాఘవేంద్రరావు కూడా తన తాజా చిత్రం 'ఓం నమో వేంకటేశాయ:' విషయంలో ఇలాంటి ఎన్నో నిబంధనలు అమలు చేస్తున్నాడని సమాచారం. ఈ చిత్రం షూటింగ్ శ్రీవేంకటేశ్వరస్వామి గుడి సెట్‌లో జరుగుతోంది. రాఘవేంద్రరావు ఈ చిత్రం విషయంలో పలు నియమాలు పాటిస్తున్నాడు. ఎవరైనా సరే సెట్‌లోకి అడుగుపెట్టే ముందు చెప్పులను బయటే వదిలిరావాలి. అందరూ కుర్తాలను వేసుకోవాలి. నామాలను లేదా బొట్టును తప్పకుండా పెట్టుకోవాలి. ఎవరు ఎవరితో మాట్లాడినా మొదట గోవిందా అంటూ సంభాషణ ప్రారంభించాలి. షూటింగ్ సమయంలో భోజనం విషయంలో ఎవ్వరూ మాంసాహారం తినకూడదు. సెల్‌ఫోన్లను సెట్‌లోకి తీసుకొని రావడం నిషిద్దం. ఇలా దర్శకేంద్రుడు పలు నిబంధనలను విధించి అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది.