ఎక్కడైనా ఏ పార్టీలో అయినా, ఏ రాష్ట్రంలోనైనా ప్రతిపక్ష నాయకులు అధికార పార్టీ పంచన చేరేది పదవి లేదా ఇతర ఆర్ధిక లాభాల కోసమే అనేది స్పష్టం. కానీ అలా మారిన వారిని కొందరిని అదృష్టం వరిస్తే, మరికొందరిని దురదృష్టం వెంటాడుతుంది. ఏపీలో వైసీపీ పార్టీ నుండి అధికార టిడిపిలోకి వచ్చిన పలువురు ఎమ్మేల్యేలకు చంద్రబాబు మంత్రి పదవి ఇస్తానని మాట ఇచ్చాడనేది వాస్తవం. కానీ ఇంకో మూడేళ్లలో ఎన్నికలు రానున్న తరుణంలో ఇప్పటికైన తమకు మంత్రిపదవి ఇవ్వకపోతే ఎలా? ఏదో ఎన్నికల ముందు ఓ ఏడాది లేదా ఒకటిన్నర ఏడాది మాత్రమే ఉన్నప్పుడు తమకు మంత్రి పదవి ఇచ్చినా ఏం లాభం? అని వలస ఎమ్మెల్యేలు నిట్టూర్పు విడుస్తున్నారు. అలాంటి వారిలో జలీల్‌భాషా, భూమా, ఆనం వంటి నాయకులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇక తెలంగాణలో టిడిపి నుండి టిఆర్‌ఎస్‌లోకి వెళ్లిన తలసాని, కడియం, తుమ్మల వంటి నాయకులకు మాత్రం తగిన న్యాయం జరిగింది. కానీ అదే సమయంలో అక్కడ ఎర్రబెల్లి దయాకర్ లాంటివారికి మాత్రం నిరాశతప్పడం లేదు. మొత్తానికి ఏ రాష్ట్రంలో, ఎవరు ముఖ్యమంత్రి, ప్రధానమంత్రులైనా సరే వలసలను ప్రోత్సహించడం మాత్రం ఆగడం లేదు.