నటి, నిర్మాత, టెలివిజన్ వ్యాఖ్యాతగా పేరొందిన మంచులక్ష్మి అన్ని రంగాల్లోనూ తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకుంది. ఎప్పుడు చూసినా లక్ష్మి నే కనిపిస్తుంది, తన భర్త ఎక్కువగా ఎక్కడా కనిపించడు అనుకునే వాళ్ల కోసమే ఏమో.. సాఫ్ట్ వేర్ గా స్థిరపడిన లక్ష్మి భర్త ఆనంద్ ఇప్పుడు హోటల్ రంగంలో అడుగుపెట్టి, అందరి కంటా పడనున్నాడు. ‘జూనియర్ కుప్పన్న’ పేరుతో ఒక ఫ్యామిలీ రెస్టారెంట్ ను ప్రారంభించనున్నాడు.
ఈ ఫ్రాంచైజ్ లో మొదటి రెస్టారెంట్ ను హైదరాబాద్ లోని హైటెక్ సిటీలో మంచు మోహన్ బాబు ఈరోజు(జులై 6) ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ.. నాకు ఎప్పటినుంచో ఫైవ్ స్టార్ హోటల్ పెట్టాలన్న నా కోరిక ను మా తండ్రి కి చెప్పగా, ఆయన హోటల్ ఎందుకు నలుగురికి ఉపయోగపడే విధంగా ఏదైనా స్కూల్ కట్టించు అన్నాడు. ఆ నేపథ్యంలోనే నేను శ్రీ విద్యానికేతన్ ను మొదలుపెట్టి నా తండ్రి కోరికను నెరవేర్చాను. కానీ నా కోరిక మాత్రం అలాగే ఉండిపోయింది. ఇప్పుడు నా కోరికను మా అమ్మాయి లక్ష్మీ ప్రసన్న, అల్లుడు ఆనంద్ నెరవేరుస్తున్నందుకు సంతోషంగా ఉంది. జూనియర్ కుప్పన్నఫ్రాంచైజీని ఎంచుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఇక్కడ దొరికే ప్రతి వంటకం, ఎటువంటి కెమికల్స్ లేకుండా, ఒకసారి తింటే నెలజీతం మొత్తం ఈ రెస్టారెంట్ కే అంకితమిచ్చేలా ఉంటుందన్నారు.
మంచు లక్ష్మి మాట్లాడుతూ.. ఈ రెస్టారెంట్ ను హైదరాబాద్ లో మొదటిగా తామే పరిచయం చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. చెన్నై, బెంగుళూరు లలో జూనియర్ కుప్పన్న రెస్టారెంట్ గురించి, ఆ రుచి తెలియని వారుండరు. నేను బెంగుళూరు వెళ్తే కుప్పన్నకు వెళ్లకుండా, వచ్చేదే ఉండదు. మెడిటేషన్ మైండ్ కు, కుప్పన్న కడుపు కు అనే ఫార్ములాను మాత్రం అక్కడున్నప్పుడు నేను తప్పకుండా ఆచరించే ఫార్ములా. మా అదృష్టం కొద్దీ కుప్పన్న ఓనర్ నాకు మంచి ఫ్రెండ్ కావడంతో, మాకు ఈ ఫ్రాంఛైజ్ దొరికింది. ప్రతి ఒక్కరికి ఇంటి రుచిని మరిపించే విధంగా ఈ రెస్టారెంట్ ను హైదరాబాదీయులకు అందుబాటులోకి తీసుకురావడం ఎంతో సంతోషంగా ఉంది అన్నారు.
కార్యక్రమంలో మోహన్ బాబుతో సహా, మంచు వారసులు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు.