తమిళ చిత్రాలు డబ్బింగ్ కాకుండా అయినా సరే కేరళలో విడుదలై సంచలనం సృష్టిస్తుంటాయి. అందుకే అక్కడ తమిళ సినిమాలకు ఎక్కువ పోటీ ఉంటుంది. ఇక సౌతిండియన్ సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమా అంటే ఇక దానికి తిరుగేలేదు. ఆయన చిత్రాలకు భాషా బేధం లేకుండా అన్ని భాషల్లోనూ రైట్స్ హాట్‌కేకుల్లా అమ్ముడుపోతాయి. కాగా మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్‌కు, రజనీకు మధ్య ఎంతో సాన్నిహిత్యం ఉంది. అందుకే 'కబాలి' కేరళ రైట్స్‌ను కేరళలో మోహన్‌లాల్‌కు చెందిన మ్యాక్స్ లాబ్ మరో డిస్ట్రిబ్యూషన్ సంస్ధ 'ఆశీర్వాద్' తో సంయుక్తంగా కలిసి కొన్నారు. ఫ్యాన్సీ రేట్‌కు ఈ చిత్ర రైట్స్‌ను తీసుకున్నట్లుగా సమాచారం. ఈ చిత్రాన్ని కేరళలో 150 థియేటర్లలో విడుదల చేయనున్నారు. మనకు ఈ సంఖ్య తక్కువగా కనిపించినా కేరళ విస్తీర్ణం, జనాభాతో పోలిస్తే ఇదో రికార్డ్ అని చెప్పాలి. గతంలో బన్నీ నటించిన 'సరైనోడు' చిత్రం 80 థియేటర్లలో అంటే.. అదే పెద్ద సంచలనం అన్నారు. దానికి దాదాపు రెట్టింపు థియేటర్లలో 'కబాలి' విడుదల కానుంది. మోహన్‌లాల్‌తో ఉన్న సాన్నిహిత్యం మీద ఈ చిత్రం కోసం రజనీకాంత్ ఒక రోజంతా కొచ్చిలో జరిగే ప్రమోషన్‌లో పాల్గొననున్నాడు. కాగా ముందుగా చెప్పినట్లు ఈ చిత్రం జులై 15 కూడా విడుదల చేసే అవకాశాలు కనిపించడంలేదు. వాస్తవానికి అమెరికాలో రజనీ ఆరోగ్య సమస్యల కారణంతో ట్రీట్‌మెంట్ కారణంగా ఈచిత్రం తమిళ వెర్షన్ డబ్బింగ్‌ను ఇంకా రజనీ పూర్తిచేయలేదని, ఆ కారణంగానే ఈ చిత్రం విడుదల విషయంలో జాప్యం జరుగుతున్నట్లు సమాచారం.