ఇటీవల తుని సంఘటన కేసుల్లో పలువురిని అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తూ ముద్రగడ దాదాపు రెండు వారాల పాటు దీక్ష చేసిన సంగతి తెలిసిందే. కాగా ఆగష్టు నెలలో కాపులకు సంబంధించిన రిజర్వేషన్లపై మంజునాధన్ కమిటీ తమ రిపోర్ట్‌ను ఇవ్వనుంది. ఈ రిపోర్ట్‌లో నిర్ణయం కాపులకు వ్యతిరేకంగా వస్తే మరోసారి దీక్ష చేయడానికి ముద్రగడ ప్రణాళికలు రచిస్తున్నాడు. ప్రస్తుతం తనను కలిసిన కుల నాయకులతో ఆయన అదే మాట చెబుతున్నాడు. దీంతో మరోసారి ఆగష్టు సంక్షోభాన్ని చంద్రబాబు నాయుడు ఎదుర్కోక తప్పదని అర్ధమవుతోంది. తుది తీర్పు మంజునాధన్ కమిషన్‌దే కావడంతో ఆ కమిషన్ ఏది సిఫార్సు చేస్తే దాన్నే ఆచరణలోకి ఒప్పుకోవడం ఎవరికైనా కనీస బాధ్యత. అంతేగానీ కమిషన్ వేరుగా స్పందించి కాపు రిజర్వేషన్లు వద్దని చెబితే దానికైనా సరే కుల నాయకులైన ముద్రగడ వంటి వారు అంగీకరించడం న్యాయం. అంతేగానీ మంజునాధన్ కమిషన్ తమకు అనుకూల ఫలితాన్ని అందిస్తే ఒకలాగా, అలా కాకుండా తమకు వ్యతిరేకంగా కమిషన్ రిపోర్ట్ ఇస్తే మరోసారి దీక్ష చేస్తామని మంజునాధన్ కమిషన్‌ను, ప్రభుత్వాన్ని బ్లాక్‌మెయిల్ చేయడం సరైన పని అనిపించుకోదు. దీంతో ఆగష్టులో ముద్రగడ చేయదలచిన దీక్షను ఈసారి ఎలాగైనా తిప్పికొట్టాలని చంద్రబాబు ప్రభుత్వం కూడా కృతనిశ్చయంతో ఉందని సమాచారం.