ఒక చిత్రంలో ఎక్కువ మంది ఆర్టిస్ట్‌లు ఉంటే వారిని అందరినీ డీల్ చేసి సరిగ్గా వాడుకొని ప్రేక్షకుల చేత సెహభాష్ అనిపించుకోవడం అంత సులభం కాదు. ఏ పాత్రకైనా సరైన న్యాయం చేయలేకపోతే విమర్శలు తప్పవు. కానీ కొరటాల శివ తన మొదటి చిత్రం 'మిర్చి' లో ప్రభాస్‌తో పాటు సత్యరాజ్‌ను, నదియాను,అనుష్కను అందరినీ బ్యాలెన్స్ చేసి మెప్పించాడు. ప్రతి పాత్రకు న్యాయం చేశాడు. అదే ఫీటును తన రెండో చిత్రం 'శ్రీమంతుడు'లో కూడా చేసి ఎక్స్‌లెంట్ అనిపించాడు. మహేష్‌బాబు, శృతిహాసన్, జగపతిబాబు, రాజేంద్రప్రసాద్... వంటి ఆర్టిస్ట్‌లను బాగా వాడుకొని వారికంటూ ఓ ప్రత్యేకత ఉండేలా చేసి సద్వినియోగం చేసుకున్నాడు. ఇప్పుడు ఆయన ఎన్టీఆర్‌తో చేస్తున్న 'జనతాగ్యారేజ్' చిత్రంలో కూడా అదే ఫీటును చేస్తున్నాడు. ఎన్టీఆర్, మోహన్‌లాల్, సాయికుమార్, విదిష, సమంత, నిత్యామీనన్, సచిన్ కేద్కర్, ఉన్నిముకుందన్.. ఇలా ఈ చిత్రంలో పలువురు మంచి ఆర్టిస్ట్‌లు ఉన్నారు. మరి వీరందరికీ సరైన న్యాయం చేసే బరువు, బాధ్యత కొరటాలపై ఉంది. ముఖ్యంగా ఈ చిత్రంలో ఆయన ఎన్టీఆర్‌తో పాటు మోహన్‌లాల్‌ను కూడా ఎంత బాగా ఉపయోగించుకుంటే, సినిమా విడుదల తర్వాత ఈ చిత్రానికి అంత మేలు జరుగుతుంది. అదే సమయంలో మలయాళంలో కూడా మోహన్‌లాల్ క్యారెక్టర్‌ను చూపించిన విధానంపైనే అక్కడ కూడా ఈ చిత్రం విజయం సాధించే అవకాశాలు ఆధారపడివున్నాయి.