రాష్ట్రంలో మిత్రపక్షాలైన టిడిపి, బిజెపిల మధ్య నిన్న మొన్నటి వరకు సాగిన మాటల యుద్దం ఈమధ్య కాస్త చల్లారింది. రాజ్యసభ సీటును కేంద్రమంత్రి సురేష్‌ప్రభుకు కేటాయించిన తర్వాత కాస్త పరిస్థితి సద్దుమణిగినట్లు కనిపించింది. అయితే తాజాగా ఈ వార్‌ను మరలా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, రెవిన్యూ శాఖా మంత్రి కే.ఈ.కృష్ణమూర్తి మొదలుపెట్టాడు. కేంద్రంలోని ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా, రైల్వే జోన్ అవసరం లేదన్నట్లుగా వ్యవహిరిస్తోందని, పోలవరం తామే కడతామని చెబుతూనే ఇప్పటికే ఆ ప్రాజెక్ట్‌పై ఏపీ ఖర్చు పెట్టిన రూ. 5000 కోట్లను తిరిగి ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. ఇకనైనా కేంద్రం వైఖరి మార్చుకోవాలని లేకపోతే పరిస్థితి చేయిదాటుతుందని తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. కేఈ ఈ వ్యాఖ్యలు చేసినప్పుడు మరో మంత్రి అచ్చెనాయుడు కేఈ పక్కనే ఉన్నారు. అచ్చెన్నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అత్యంత సన్నిహితుడు. కానీ కేఈ వ్యాఖ్యలను ఆయన ఖండించే ప్రయత్నం చేయలేదు. నవ్వుతూ పక్కనే కూర్చున్నాడు. దీనిబట్టి కేఈ ఘాటు విమర్శల వెనుక ఆయన హస్తం కూడా ఉందని, ఆయన ప్రోత్సాహంతోనే కేఈ అలా మాట్లాడి ఉంటాడనే వాదన వినిపిస్తోంది. మొత్తానికి కొంతకాలంగా చల్లారిన టిడిపి-బిజెపి చిచ్చు మరలా తెరపైకి వచ్చినట్లయింది..